సీఎస్ఆర్ నిధులతో భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధి గిరిజన ప్రాంత ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ సూచించారు.
ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల పెంపునకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.8 కోట్ల 74 లక్షల 25 వేల రూపాయలను గత సంవత్సరం మంజూరు చేసిందన్నారు.
వాటిల్లో 10శాతం విడుదల..
వాటిలో 10 శాతం నిధులు 87 లక్షల 42 వేల 500 రూపాయలను విడుదల చేసిందని తెలిపారు. ఆ నిధులతో ఆరు నెలల్లోపు రెండు జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
కొనుగోళ్లకు చర్యలు చేపట్టండి..
వారం రోజుల్లోగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆయా జిల్లాల్లో అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అత్యాధునిక వైద్య పరికరాలు అవసరమే..
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక వైద్య పరికరాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని ఏటూరునాగారం ఐటీడీఎ పీఓ హనుమంతు కొండిబా జండగే అన్నారు. ప్రభుత్వ నిధులకు సీఎస్ఆర్ నిధులు తోడైతే గిరిజన ప్రాంతాల ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు మరింత మెరుగవుతాయని అన్నారు.
కార్యక్రమంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అదనపు కలెక్టర్లు ఆదర్శ్ సురభి, వైవి గణేష్, డీఎంహెచ్ఓలు డాక్టర్ అప్పయ్య, డాక్టర్ సుధీర్ సింగ్‌లు, సీపీవోలు రవి, బిక్షపతిలు, కలెక్టర్ కార్యాలయ మహేష్ బాబు, డీసీహెచ్ ఎస్‌లు డాక్టర్ చందు నాయక్, డాక్టర్ తిరుపతి, డీఐఓ డాక్టర్ ఉమాదేవి, టీఎస్ఎంఐడీసీ డీఈ ఉమా మహేశ్వరరావు, పంచాయతీరాజ్ ఈఈ రాంబాబు, ప్రభుత్వ వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు