తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఇవాళ ఉదయం 10 గంటలకు గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, రక్షాబంధనం, నవగ్రహ, కలశ ఆరాధన, అగ్ని ప్రతిష్ట పూజలతో ఆలయ అర్చకులు ఉత్సవాలు ప్రారంభించారు. ఈ రోజు రాత్రి స్వామివారి ఊరేగింపు, ఎదుర్కోలు సేవ జరపనున్నారు.
శుక్రవారం సాయంత్రం 4గంటల 26నిమిషాలకు శ్రీ ముక్తీశ్వర స్వామి, శుభనంద కల్యాణం, రాత్రి 12 గంటలకు మహాఅభిషేకం, లింగోద్భవ పూజ, ఛండీహవనము, కాళరాత్రి హవనము, విశేష పూజలు జరగనున్నాయి. ఈ వేడుకలకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా... మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు.