తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నెపల్లి పంపుహౌస్‌ పునరుద్ధరణకు సమయం.. అన్నారం పరిస్థితీ అంతే..

kaleshwaram pump house: ఇటీవల భారీ వరదలకు నీట మునిగిన కాళేశ్వరం ఎత్తిపోతల పంప్​హౌస్​లు కన్నెపల్లి, అన్నారం మరమ్మతులకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. రక్షణ గోడ నిర్మాణం పూర్తయితే గానీ పనులు ప్రారంభించడానికి వీల్లేకపోవడమే ఇందుకు కారణం.

kannepalli pump house repair
kannepalli pump house repair

By

Published : Aug 9, 2022, 8:43 AM IST

kaleshwaram pump house: భారీ వరదకు నీట మునిగిన కాళేశ్వరం ఎత్తిపోతల మొదటి పంపుహౌస్‌ కన్నెపల్లి(లక్ష్మీ), అన్నారం మరమ్మతు పనుల్లో మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. రక్షణ గోడ నిర్మాణం పూర్తయితే గానీ పనులు ప్రారంభించడానికి వీల్లేకపోవడమే దానికి కారణం. ఈ నేపథ్యంలో రక్షణ గోడకు సంబంధించిన డిజైన్‌ను తాజాగా సంబంధిత ఇంజినీర్లు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీఓ)కు పంపినట్లు తెలిసింది. వచ్చే రెండు నెలలు వర్షాకాలం కావడం, గోదావరికి వరద భారీగా ఉండే అవకాశం ఉన్నందున వెంటనే ఈ పనిని ప్రారంభించడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఏడు మోటార్లకు నష్టం..రెండు పంపుహౌస్‌ల నిర్మాణంలోని ఎలక్ట్రో మెకానికల్‌ పనుల్లో విదేశీ కంపెనీలు ఏబీబీ, యాండ్రిజ్‌, సీమన్స్‌ మొదలైనవి భాగస్వామ్యం వహించాయి. ప్రస్తుతం ఈ సంస్థలకు చెందిన నిపుణుల బృందాలు రెండు పంపుహౌస్‌లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. మోటార్లు, ఇతర ఎలక్ట్రో మెకానికల్‌ పరికరాలు ఏ మేరకు దెబ్బతిన్నాయి? ఇందులో ఉపయోగపడేవి ఏవి? దెబ్బతిన్నవి ఏవి? అనేది అవి అంచనా వేస్తున్నాయి. లక్ష్మీ పంపుహౌస్‌లో 17 మోటార్లకు గానూ ఏడింటికి నష్టం వాటిల్లినట్లు ఆ బృందాలు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. క్రేన్‌ విరిగిపడటం వల్ల రెండు మోటార్లకు మాత్రమే పాక్షికంగా నష్టం జరిగి ఉండొచ్చని ఇంజినీర్లు చెబుతున్నప్పటికీ.. వాస్తవంగా నష్టం మరింత ఎక్కువగానే ఉండొచ్చని విశ్వసనీయంగా తెలిసింది.

నివేదిక తర్వాతే స్పష్టత..మరోవైపు అన్నారం పంపుహౌస్‌లో మోటార్లు, అందులోని రోటర్లతో సహా అన్నింటినీ బయటకు తీసి పరిశీలిస్తున్నారు. ఇందులో దెబ్బతిన్న వాటిని పూర్తిగా మార్చడానికే గుత్తేదారు సంస్థ ప్రయత్నిస్తున్నట్టు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. త్వరలోనే ఆ బృందాలు నివేదికను నీటిపారుదల శాఖకు అందజేయనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక తర్వాతనే ఏయే పరికరాలు మార్చాల్సి వస్తుంది, అందులో గ్యారంటీ ఉన్నవి ఏవి? గ్యారంటీ ముగిసినవి ఏవి? అనే దానిపై స్పష్టత వస్తుందని నీటి పారుదల శాఖ భావిస్తోంది. మొత్తంగా రెండు పంపుహౌస్‌ల విషయంలో పూర్తి స్పష్టత రావడానికి మరింత సమయం పట్టొచ్చని సమాచారం.

ఈ పరిస్థితుల్లో పంపుహౌస్‌లోకి నీరు రాకుండా అడ్డుకునే రక్షణ గోడ నిర్మాణం, దెబ్బతిన్న మోటార్లు, పరికరాల మరమ్మతు లేదా మార్పునకు మరింత సమయం తీసుకునే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. అన్నారం పంపుహౌస్‌లో మోటార్లన్నింటినీ ఇంజినీర్లు పరీక్షిస్తున్నారని, వచ్చే నెలలో ఒక దాన్నయినా నడపటానికి ప్రయత్నిస్తున్నామని కాళేశ్వరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. లక్ష్మీ పంపుహౌస్‌కు సంబంధించి స్పష్టత రావడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details