25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన అధికారులు మూడేళ్లు దాటినా వాటిని పూర్తి చేయలేకపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొలువైన కాళేశ్వరం పుణ్యక్షేత్రం అభివృద్ధి పనులతో అసంపూర్తిగా మిగిలిపోతుంది. పర్యటకంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయించినా... అధికారులు నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
మూడేళ్లుగా పూర్తికాని నిర్మాణాలు
దేవాదాయ శాఖకు రూ.3 కోట్ల వ్యయంతో 12 పనులు, పంచాయతీరాజ్ శాఖకు రూ. 18 కోట్లతో 15 పనులు, రూ. అటవీశాఖకు రూ. కోటి, ఇతర పనులకు మిగతా కేటాయించారు. ఆయా నిధులతో అనివెట్టి మండపం, 100 గదుల కాటేజీ, ప్రసాదాల తయారీ, రహదారుల విస్తరణ, ఆలయాలకు గోపురం, అభిషేక మండపం, తదితర పనులు చేపట్టాల్సి ఉన్నా... మూడు శివరాత్రులు దాటినా... నిర్మాణాలకు రూపమే సంతరించుకోవడంలేదు.
ఇవి మాత్రమే పూర్తి అయ్యాయి...
ప్రసాదాల తయారీ భవనం, ఈవో కార్యాలయం, అనివెట్టి మండపాలు, దుకాణ సముదాయాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా కొన్ని పనులు కొనసాగుతుండగా, మరికొన్ని షురూనే కాలేదు.
స్థల సేకరణకు గ్రహణం
స్థలాభావంతో ఆలయానికి ప్రధాన ముఖద్వారం, అపరకర్మ మండపం, పార్కింగ్, డార్మేటరీ, రాజగోపురం ముందు రహదారి విస్తరణ, బస్టాండ్ నుంచి గోదావరి వరకు రహదారి విస్తరణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. స్థల సేకరణకు నిధుల లేమి, నిర్లక్ష్యం, కొందరి ప్రమేయం, తదితర కారణాలతో స్థల సేకరణకు గ్రహణం పట్టింది. కాళేశ్వరంలో స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ జాగాలున్నా.. అటవీ, రెవెన్యూ తగాదాలు ఉన్నాయి.
దేవాదాయ శాఖ చేపట్టిన పనులు ఇలా..
సరస్వతీదేవి ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణాలు పూర్తయ్యాయి. రాజగోపురాలకు, ఇతర ఆలయాలకు తలుపులు బిగించారు. ప్రాకారంలోని విగ్రహాల ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయానికి ముందు అనివెట్టి మండపం, ప్రసాదాల తయారీ భవనం అయిపోయింది.
రామాలయం ఆవరణలో మరమ్మతులు, ప్రహరీ నిర్మాణాలు పూర్తి కాగా గుత్తేదార్ల నిర్లక్ష్యంతో గోడకు పగుళ్లు తేలగా... వాటికి పై పూతలు అద్దారు. పార్వతీ ఆలయం ముందు మండపం, కల్యాణ మండప నిర్మాణాలు 70 శాతం, సుబదా మండప నిర్మాణాలు 50 శాతం మేరకు మాత్రమే అయ్యాయి. నాలుగు ధ్వజ స్తంభాల కోసం లేఖలు అటవీ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నాయి.