కాళేశ్వరం ప్రాజెక్టులోని మొదటిది.. ప్రధానమైన లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి ఈనెల 17న నీటి తరలింపులు ఆరంభమైన మరుసటి రోజు పంపులను నిలిపివేశాలు. తిరిగి 19న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పగలంతా పంపులను నిలిపివేసిన ఆరోజు సాయంత్రం నుంచి వరుసగా పంపులను నడిపిస్తున్నారు. గడిచిన 11 రోజుల నుంచి బుధవారం రాత్రి వరకు 7.5 టీఎంసీల నీటిని అన్నారం బ్యారేజ్‌కి గ్రావిటీ కాలువ ద్వారా తరలించినట్లు ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు.
దశలవారీగా తరలింపు
యాసంగి పంటల కోసమే కాళేశ్వరం జలాలను అందించేందుకే పంపులను రన్ చేస్తున్నట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ముందుగా 10.5 టీఎంసీల లక్ష్యంగా ఎత్తిపోయాలని తలచారు. తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని యాసంగి కోసం నిరంతరం ఎగువకు తరలించారని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. యాసంగి పంటలకు కాళేశ్వరం జలాలను ఇవ్వాలని సీఎం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. తిరిగి సీఎం ఆదేశాలు వచ్చేంత వరకు ఎత్తిపోతలు కొనసాగనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటివరకు దశలవారీగా లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి 77.90 టీఎంసీల నీటిని సరస్వతి బ్యారేజ్‌కు తరిలించారు.
కళకళలాడుతోన్న గోదారి
2019 జూన్ 21 నుంచి 2020 మే 14 వరకు 62 టీఎంసీలు, ఆ తర్వాత గతేడాది ఆగస్టు నెలలో 8.40 టీఎంసీలను ఎత్తిపోశారు. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టు తొలి నిర్మాణమైన మేడిగడ్డ బ్యారేజి నుంచి గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ వరకు ఎత్తిపోతలు జరిగాయి. తర్వాత ఈనెల 17 నుంచి తిరిగి పంపులను రన్ చేస్తున్నారు. ఈ ఏడాది యాసంగి పంటలకు కాళేశ్వరం నీటిని అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రాణహిత నది నుంచి నీటి ప్రవాహం తగ్గినా ప్రస్తుతానికి కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి కళకళలాడుతోంది. కాళేశ్వరం జలాలతో యాసంగి పంటలకు సాగునీటి ఇబ్బందులు తీరనున్నాయి.