నేడు కాళేశ్వరం పనులను పరిశీలించనున్న కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం కాళేశ్వరం ముక్తేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం... అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. జులైలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఆ దిశగా పనుల పురోగతి, ఇతర అంశాలపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు.
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. నిర్మాణంలో ఉన్న రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో పాటు ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఇవాళ జిల్లాలకు వెళ్లనున్నారు. మొదట రామగుండం వెళ్లనున్న సీఎం... అక్కడ 1600 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్టీపీసీ నిర్మిస్తోన్న పవర్ ప్లాంట్ను సందర్శిస్తారు. అక్కడి పనుల పురోగతి తెలుసుకుంటారు. ప్లాంటు నిర్మాణం పూర్తి అందుబాటులోకి రావడం తదితర విషయాలపై ఆరా తీయనున్నారు. అక్కడే ఎన్టీపీసీ, జెన్కో అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. ప్లాంటు సంబంధిత అంశాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ విషయం కూడా సమావేశంలో చర్చిస్తారు.