తెలంగాణ

telangana

ETV Bharat / state

100 టీఎంసీల నీటిని తరలించిన కాళేశ్వరం

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరో ఘనతను సాధించింది. మొదటి దశలో సరస్వతి, పార్వతి పంప్​హౌస్​ల నుంచి ఇప్పటివరకు 100 టీఎంసీల నీటి తరలింపును పూర్తిచేసుకుంది. 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్ట్​కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. అధికారులు, ఇంజినీర్ల సహకారంతో మూడేళ్లలోనే ప్రాజెక్ట్​ను పూర్తైంది. ప్రాజెక్ట్​తో 21 జిల్లాలు లబ్ధి పొందుతుండగా.. 37 లక్షల ఎకరాలకు నీరందనుంది.

Kaleshwaram released 100 TMC of water
100 టీఎంసీల నీటిని తరలించిన కాళేశ్వరం

By

Published : Mar 2, 2021, 6:54 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశలో 100 టీఎంసీల నీటి తరలింపు పూర్తైంది. ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతి, పార్వతి పంప్​హౌస్​ల నుంచి కూడా ఇప్పటి వరకు 100 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోశారు. అన్నారం ఆనకట్ట ఎగువన ఉన్న సరస్వతి పంప్ హౌస్​లో 12 పంపులు ఉండగా.. 2019 జులై 22 నుంచి ఇప్పటి వరకు 9,396 గంటల పాటు పంపులు నడిచాయి. ఆ పంపుల ద్వారా 100 టీఎంసీల నీటిని సుందిళ్ల జలాశయంలోకి తరలించారు. అందుకోసం 228 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను వినియోగించారు.

సుందిళ్ల ఆనకట్ట ఎగువన ఉన్న పార్వతి పంప్ హౌస్​లో 14 పంపులు ఉన్నాయి. 2019 జూలై 31 నుంచి ఇప్పటి వరకు 10,666 గంటల పాటు పంపులను నడిపించారు. వందకుపైగా టీఎంసీల నీటిని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోశారు. అందుకోసం 321 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను ఉపయోగించారు. ప్రాజెక్టులో మొదటి ఆనకట్ట అయిన మేడిగడ్డ ఎగువన నిర్మించిన పంప్​హౌస్ కూడా.. 90 టీఎంసీల మార్కును దాటింది.

అక్కడ మొత్తం 17 పంపులు ఉండగా.. ఇప్పటి వరకు 12,149 గంటల పాటు పంపులు నడిచాయి. ఇప్పటి వరకు 92 టీఎంసీలకు పైగా.. నీటిని అన్నారం జలాశయంలోకి ఎత్తిపోశారు. అందుకోసం 328 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను ఉపయోగించారు. మూడు పంప్ హౌజుల్లో నీటి ఎత్తిపోతకు ఇప్పటి వరకు దాదాపు 500 కోట్లకు పైగా వ్యయం అయింది.

అటు రెండో లింక్​లోని రెండు పంప్ హౌస్​ల నుంచి ఇప్పటికే 100 టీఎంసీలకుపైగా నీటిని ఎత్తిపోశారు. ఆరో ప్యాకేజీలోని నంది, ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి పంప్ హౌస్​ల నుంచి.. ఎత్తిపోసిన నీటి పరిమాణం కొద్ది రోజుల కిందే 100 టీఎంసీల మార్కును దాటింది.

ఇదీ చూడండి :ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details