సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్లు అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 33 జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎఫ్ఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో ఏడో విడత హరితహారం, పల్లె ప్రకృతి వనం, పట్టణ ప్రకృతి వనం, మల్టీ లెవెల్ నర్సరీలకు భూమి గుర్తింపు, శానిటేషన్, సీజనల్ వ్యాధులు, కరోనా వ్యాక్సినేషన్, కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణాల పూర్తి సంబంధిత విషయాలపై సమావేశంలో చర్చించారు.
పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి..
జిల్లాల వారిగా సంబంధిత పరిపాలన అధికారులు ఏడో విడత హరితహారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.