'పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది.. డబ్బులు కూడా లేవు..' - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
Bhupalpally resident trapped in Ukraine : ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడ భీకర వాతావరణం నెలకొంది. రాజధాని కీవ్‌తో పాటు పలు కీలక నగరాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన రాష్ట్ర విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 'పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది.. డబ్బులు కూడా లేవు..' అని భూపాలపల్లి పట్టణానికి చెందిన వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భూపాలపల్లి వాసి
By
Published : Feb 26, 2022, 9:54 AM IST
Bhupalpally resident trapped in Ukraine : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో... అక్కడ చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు.. ఎప్పుడు ఏమవుతుందోనని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. పిల్లలు ఎలా ఉన్నారో అంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉద్యోగం, చదువుల నిమిత్తం వెళ్లినవారు చాలా మందే ఉన్నారు. అయితే వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఉద్యోగం కోసం వెళ్లి..
భూపాలపల్లి పట్టణానికి చెందిన వెంకటేశ్ ఇటీవలే ఉద్యోగ నిమిత్తం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కి వెళ్లారు. యుద్ధ పరిస్థితులతో అక్కడ ఇబ్బందికరంగా మారిందని, డబ్బులు కూడా లేవని వీడియో రికార్డులను ఇక్కడి స్థానికులకు పంపించారు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆయనతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. భయాందోళన చెందవద్దని సూచించారు. కీవ్ నుంచి వేరే ప్రాంతానికి తరలివెళ్లినట్లు వెంకటేశ్ తెలిపారు.
భయం గుప్పిట్లో.. ఉమ్మడి కరీంనగర్ విద్యార్థులు
" వైద్యవిద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్‌కు వెళ్లిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 15 మంది వివరాలు వెలుగులోకి వచ్చాయి. కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన వారి వివరాలు గురువారం తెలియగా.. శుక్రవారం పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన ఇంకొంతమంది అక్కడే ఉన్నట్లు తెలిసింది. ఇప్పటివరకు మొత్తంగా 23 మంది వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారున్నట్లు సమాచారం.
'తొందరగా తీసుకెళ్లండి..'
Karimnagar Students in Ukraine : హైదరాబాద్‌లోని పలు కన్సల్టెన్సీల ద్వారా అక్కడికి వెళ్లిన వీరంతా కీవ్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో సురక్షితంగానే ఉన్నామంటూ ఎప్పటికప్పుడు వారి కుటుంబీకులకు సమాచారం చేరవేస్తున్నారు. యుద్ధ వాతావరణం వల్ల ఎదురైన పరిస్థితులను వారు ఆవేదనతో తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. అక్కడ తమకు ఎదురవుతున్న కష్టాలను కుటుంబీకులతో చెప్పుకొంటున్నారు. తినడానికి తిండి దొరకడం కష్టమవడంతోపాటు ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత తొందరగా తమను సొంతూళ్లకు తీసుకెళ్లేలా చూడమని అక్కడి అధికారులతోపాటు ఇక్కడి ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.
రాష్ట్రం నుంచి 1500 మంది అని అంచనా..
Indians Stuck in Ukraine : ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం చేస్తుండగా అక్కడున్న భారత వైద్యవిద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చొప్పదండి మండల పరిషత్తు సీనియర్ సహాయకులు భీôరెడ్డి నరోత్తంరెడ్డి కుమారుడు సాయిమణిదీప్‌రెడ్డి ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్‌లోని జాఫ్రోజియా వెళ్లారు. ప్రస్తుతం యుద్ధం జరుగున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి తాము 800 కి.మీ దూరంలో ఉన్నట్లు తన కొడుకు చెప్పినట్లు నరోత్తంరెడ్డి వివరించారు. ఏ క్షణంలోనైనా ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు బ్యాగులు సర్దుకోవాలని చెప్పారని, 24 గంటల్లో బస్సు ద్వారా పోలాండుకు తీసుకెళ్లి అక్కడి నుంచి స్వదేశానికి పంపిస్తామని చెప్పినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బôకర్లలోకి వెళ్లాలని సూచించారని, తెలంగాణ రాష్ట్రం నుంచి 1500 మంది ఉంటారని చెప్పారు. ఏటీఎంల్లో డబ్బులు అయిపోయినట్లు వివరించారు. రష్యా సైన్యం జాఫ్రోజియా రాష్ట్రానికి రాకపోవడంతో కొంత ఆందోళన తగ్గిందని సాయిమణిదీప్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నామని నరోత్తంరెడ్డి తెలిపారు.