తెలంగాణ

telangana

ETV Bharat / state

organic farming: వైవిధ్యమైన పంటల సాగు.. ఆదాయం.. ఆరోగ్యం.. - తెలంగాణ వార్తలు

చాలామంది రైతులు సాధారణంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నలు సాగు చేస్తుంటారు. ఇతర పంటలు సాగు చేయాలని ఆసక్తి ఉన్నా... సాగుపద్ధతులు తెలియకపోవడం, కొత్త పంటల దిగుబడి, డిమాండ్, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగును విరమించుకుంటున్నారు. కానీ కొందరు రైతులు మాత్రం నూతన పంటలు‌, వంగడాలను పండించాలని... సాగులో వైవిధ్యం చూపాలని తపిస్తుంటారు. భిన్నమైన ఆలోచనతో వైవిధ్యంగా పంటలను పండిస్తుంటారు. నూతన పంటల సాగులో సత్ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన రైతులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

organic farming, farmers tips
సేంద్రియ సేద్యం, వైవిధ్యమైన సాగు

By

Published : Oct 18, 2021, 6:27 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జగ్గయ్యపేటకు చెందిన యువ రైతు మణిగంటి కుమారస్వామి మూడేళ్లుగా బర్మా బ్లాక్ రైస్ సాగుచేస్తున్నారు. ఈ వరి వంగడం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న ఆయన... తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. కోలుకున్నాక ఆహారంపై శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచించగా... సేంద్రియ పద్ధతులు, గో ఆధారిత వ్యవసాయం చేయడం ప్రారంభించారు. జీవామృతం, ఘనామృతం, ఆకులతో కషాయాలు తయారు చేసుకుంటూ సేంద్రియ సాగుతో పాటు నూతన పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు.

వైవిధ్యమైన పంటల సాగు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి, సిద్దిపేట జిల్లా, భైంసాల నుంచి విత్తనాలు సేకరించి... మొదటి ఏడాది 20 గుంటల్లో బర్మా బ్లాక్ వరిని సాగు చేశాం. 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. దిగుబడి తక్కువే అయినా వాటిని మర ఆడించి 5 క్వింటాళ్ల బియ్యంగా మార్చి... క్వింటాకు రూ.10 వేల చొప్పున విక్రయించాం. పెట్టుబడి రూ.10 వేలు పోను... రూ.40 వేల ఆదాయం సమకూరింది. సేంద్రియ ఎరువు వినియోగంతో తక్కువ ఖర్చుతో సాధారణ వరి సాగు కంటే ఎక్కువే ఆదాయం వచ్చింది. దిగుబడి తగ్గినా బ్లాక్ రైస్‌ కు ఉన్న డిమాండ్‌తో మంచి ఆదాయం వచ్చింది. మరుసటి ఏడాది ఎకరం భూమిలో బ్లాక్ రైస్ సాగు చేయగా... 16 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దాదాపుగా రూ.లక్షకు వాటిని విక్రయించాం.

-కుమారస్వామి, రైతు

సేంద్రియ సేద్యంపై సలహాలు

ఆదాయం బాగుండటంతో ఈ ఏడాది 3 ఎకరాల్లో బర్మా బ్లాక్ పొట్టి రకం, మణిపూర్ బ్లాక్, కృష్ణవ్రీహీ, కాలాసూర్ రకం బ్లాక్ రైస్ వంగడాలతో పాటు ఆర్‌ఎన్ఆర్ లాంటి దేశీయ వంగడాలను సైతం సాగుచేస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్న పలువురు రైతులు కలిసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూపు ద్వారానే ఆయన పండించిన బ్లాక్ రైస్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఎవరికైనా బ్లాక్ రైస్ విత్తనాలు కావాలంటే కిలో విత్తనాలు ఇచ్చి... వారు పండించిన తర్వాత రెండు కిలోలు వారి నుంచి తీసుకుంటారు. అలాగే బ్లాక్ రైస్ పండించడంలోనూ సేంద్రియ సేద్యంపై సలహాలు ఇస్తారు.

కరివేపాకుతో ఆదాయం మెండు

నిజాంపల్లి గ్రామానికి చెందిన రైతు గుజ్జ రంగారావు గత ఎనిమిదేళ్లుగా కరివేపాకు సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. మిర్చి, పత్తి పంటలు సాగు చేసి పెట్టుబడికి... వచ్చే ఆదాయానికి పొంతన లేకుండా పోవడంతో విసిగిపోయి విభిన్న పంటలను సాగు చేయాలని ఆలోచించారు. పెట్టుబడి తక్కువని తెలుసుకొని కరివేపాకును సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఏడేళ్ల క్రితం ఆయనకు తెలిసిన వారితో కలిసి విజయవాడకు వెళ్లారు. అక్కడ విత్తనాలను సేకరించి... సాగు చేశారు. రెండో ఏడాది రెండు ఎకరాలు సాగు చేశారు. అలా ఏటా 6 నుంచి 8 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు.

క్వింటాకు రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తాం. రూ.250 చొప్పున విక్రయించిన 6 టన్నులకు రూ.లక్షన్నర వరకు ఆదాయం సమకూరుతుంది. మొదటి ఏడాది విత్తనాలు, ఎరువులకు రూ.లక్ష ఖర్చు వస్తుంది. రెండో ఏడాది నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి సరిపోతుంది. ఏటా రెండు కోతలకు కలుపుకొని ఎకరానికి రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. గతంలో మార్కెట్ సౌకర్యాలు స్థానికంగా లేకపోవడంతో హైదరాబాద్‌కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు హనుమకొండ, భూపాలపల్లిలో కూడా విక్రయిస్తున్నాం. నీటి వసతులు ఉండి, ఎక్కువ మొలకలు వచ్చేటట్టు విత్తనాలు నాటుకుంటే నష్టభయం లేని పంట ఇది. జూన్‌లో నాటుకుంటే డిసెంబర్ వరకు ఒకసారి, మళ్లీ మే వరకు మరోసారి కోతకు వస్తుంది. ఇతర పంటల సాగుతో పోల్చుకుంటే ఇది బాగుంది. గ్రామంలో మరికొంతమంది ఈ పంటను సాగు చేస్తున్నారు.

- గుజ్జ రంగారావు, రైతు

విభిన్న సాగు.. లాభాలు బాగు..

దుంపల్లపల్లి గ్రామానికి చెందిన సూర రవీందర్ అనే రైతు, ఆయన సతీమణి లక్ష్మితో కలిసి 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు ఉన్నత చదువులు చదివారు. వారి పెళ్లి కూడా చేశారు. వ్యవసాయం అంటే ఎంతో ప్రేమ ఉండడంతో కౌలుకు ఇచ్చిన భూమిలో మళ్లీ వ్యవసాయం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న ఆరున్నర ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

రెండు ఎకరాలు తైవాన్ జామ, ఎకరంన్నరలో అంజీర, మూడెకరాల్లో సీతాఫలం.. అంతర పంటగా బొప్పాయి, మామిడి సాగు చేస్తున్నాం. వీటితో పాటు రామఫలం, లక్ష్మణ ఫలం, బత్తాయి, వాటర్ ఆపిల్, పనస, నారింజ వంటి పండ్ల మొక్కలను నాటాం. రెండు ఎకరాల్లో తైవాన్ జామ నాటిన ఆరు నెలల నుంచి కోతకు రావడం ప్రారంభమైంది. మూడేళ్ల కాలంలో సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేయగా... ఇప్పటివరకు 9 లక్షల ఆదాయం వచ్చింది. ఒకసారి తోటలు నాటుకుంటే పన్నెండేళ్ల పాటు కాత వస్తుంది.

-సూర రవీందర్, రైతు

పండ్ల సాగు

ఎకరంన్నర భూమిలో రూ.50వేలు ఖర్చు చేసి అంజీర సాగు చేశారు. ఇప్పుడిప్పుడే పండ్లు రావడం ప్రారంభం అయింది. ఈ పండ్ల కోసం కొనుగోలుదారులు తోట వద్దకే వచ్చి రూ.100 కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు రూ.20 వేల ఆదాయం వచ్చిందని రవీందర్ చెబుతున్నారు. ఈ తోట పూర్తిస్థాయిలో పంటకు వస్తే ఎకరానికి ఏడాదిలో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. మరో మూడు ఎకరాల్లో ఏడాది క్రితం సీతాఫలం మొక్కలు నాటారు. కాయలు రావడానికి మరో మూడేళ్లు సమయం పడుతుందని అంతరపంటగా రూ.లక్ష పెట్టుబడితో ఎనిమిది నెలల కింద బొప్పాయి సాగుచేశారు. అది కాస్త మూడు నెలల క్రితం నుంచే కోతకు రావడంతో ఇప్పటివరకు రూ.3 లక్షల ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు. మరో ఐదు నెలల వరకు మరో రూ.మూడు లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆ అన్నదాతలు ఆదర్శం

మార్కెట్ అవసరం లేకుండానే తోట వద్దకు వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. నీటి వసతి కోసం రెండు బావులు తవ్వించి డ్రిప్ పద్ధతిన మొక్కలకు నీటిని పెడుతున్నారు. 58 ఏళ్ల వయసులో కూడా ఉత్సాహంగా పంటలు పండిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పండ్ల తోటల సాగు విధానాలను తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. కడియం నుంచి మొక్కలు తెచ్చుకున్నారు.

ఈ విధంగా వైవిధ్యమైన సాగుతో రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు రేగొండ మండలంలోని రైతులు. పండ్ల తోటల పెంపకంతో ఆదాయాలు బాగున్నాయని చెబుతున్నారు. సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:Crop loss due to rains: అన్నదాతల ఆశలపై వాన జల్లు.. చేతికొచ్చిన పంట వర్షార్పణం

ABOUT THE AUTHOR

...view details