అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం అన్నారు. మహాముత్తారం మండలంలో జిల్లా పాలనాధికారి పర్యటించి వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులను, పంటలను పరిశీలించారు. ముందుగా ఆజంనగర్ - మీనాజీపేట గ్రామాల మధ్య వర్షాలతో కోతకు గురైన రోడ్డును పరిశీలించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయించాలని పంచాయతీ రాజ్ డీఈ సాయిలును ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని... అధిక వర్షాలతో పంట నష్టపోయిన ప్రతీ రైతుకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పొలాల్లోకి నీరు రాకుండా కరకట్టలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
అధిక వర్షాల సమయంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నారని కలెక్టర్ అన్నారు. నిమిషాల సమయంలోనే బాధితులకు తాత్కాలికంగా పునరావాసం ఏర్పాటు చేసి ఆ పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించామన్నారు. జిల్లా అధికార యంత్రాంగం స్పందించిన తీరును రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు, ఇండ్లను కోల్పోయిన ప్రజలకు త్వరగా నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.