జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆరో విడత హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, జడ్పీ ఛైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరయ్యారు.
జయశంకర్ జిల్లాను ఉద్యానవనంగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ అబ్దుల్ అజీం - హరితహారంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్
ఆరో విడత హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లాలో 61 లక్షల మొక్కలు నాటనున్నట్లు జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో ఆయన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో 61 లక్షల మొక్కలు నాటనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే నర్సరీల ద్వారా మొక్కలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలను తలపించేలా జిల్లాలో రేగొండ నుంచి భూపాలపల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా 3 లేయర్లుగా మొక్కలు నాటనున్నామని తెలిపారు. జిల్లాలోని పెద్ద గ్రామాల్లో ప్రగతి వనం పేరుతో ఒక ఎకరంలో పార్క్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వివిధ గ్రామాల్లో చిట్టడవిని తలపించేలా ఎకరం స్థలంలో నాలుగు వేల మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి ఇరువైపులా 200 మీటర్ల దూరం నుంచి పూల మొక్కలను నాటి అందంగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు. దీనికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి:'30 కోట్ల మొక్కలు నాటడమే ఆరో విడత హరితహారం లక్ష్యం'