కౌన్సిలర్ల నేతృత్వంలో.. పట్టణంలో వార్డుల వారీగా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వాహణకు చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సింగరేణి ఇల్లందు క్లబ్‌హౌస్‌లో.. మున్సిపల్ ఛైర్ పర్సన్ వెంకటరాణి అధ్యక్షతన జరిగిన మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
పట్టణంలో.. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సదరన్ క్యాంపులు నిర్వహించి దివ్యాంగులకు పింఛన్ వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ప్రార్థన మందిరాలకు సమీపంలో మాంసం దుకాణాలు ఉండకుండా చూడాలని వివరించారు. స్మశాన వాటికలకు అవసరమైన స్థలాన్ని తక్షణమే అందించాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
వార్డుల వారీగా తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయిస్తాం. వారు స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో పని చేస్తారు. పనుల వేగవంతానికి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మున్సిపల్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు నిబంధనల మేరకే జరిగేలా చూడాలి.
- కలెక్టర్