Police recruitment: రాష్ట్రంలో భారీఎత్తున పోలీస్ నియామక ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో జిల్లాలవారీగా కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈసారి ఆరు నోటిఫికేషన్లలోని మొత్తం 17,281 పోస్టుల్లో 16,694 కానిస్టేబుల్ స్థాయిలోనివే కావడం ఇందుకు కారణం. మొత్తం పోస్టుల్లో అత్యధికం ఇవే కావడంతో పోటీ సైతం వీటికే నెలకొంది. ఈసారి కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి సుమారు 5-6లక్షల దరఖాస్తులు వస్తాయని తెలంగాణ పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అంచనా వేస్తోంది. ఈ పోస్టులు జిల్లా కేడర్‌కు చెందినవే కావడంతో స్థానికత అంశం కీలకంగా మారింది. తెలంగాణలోని 29 పోలీస్ యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధిక.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యల్ప పోస్టులు కనిపిస్తున్నాయి.ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్(ఏఆర్) విభాగం పోస్టుల పరంగా హైదరాబాద్‌లో భారీగా బ్యాక్‌లాగ్‌లు మిగలడం ఇందుకు కారణమైంది. అన్ని యూనిట్లలో కలిపి ఏఆర్ విభాగంలో 978 బ్యాక్‌లాగ్ పోస్టులుండగా హైదరాబాద్ కమిషనరేట్‌లోనే 943 ఉండడం గమనార్హం.
జిల్లాల వారీ నియామకాలు ఉండవు:విభాగాల వారీగా పరిశీలిస్తే ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్(టీఎస్‌ఎస్పీ) పోస్టుల సంఖ్య 5010. అలాగే ప్రత్యేక భద్రత దళం(ఎస్పీఎఫ్) పోస్టులు 390 ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులే ఉన్నా ఎంపికలో మాత్రం జిల్లాలవారీగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. వీటికి సంబంధించిన యూనిట్లు టీఎస్‌ఎస్‌పీ పోస్టులను కంటిగ్యుయెస్ జిల్లా కేడర్‌గా, ఎస్పీఎఫ్‌ను రాష్ట్ర కేడర్‌గా పరిగణిస్తున్నారు. సాధారణంగా టీఎస్‌ఎస్పీ కానిస్టేబుళ్లు బెటాలియన్లలో పనిచేస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణలో 13 బెటాలియన్లున్నాయి. అలాగే ఎస్పీఎఫ్ బలగాలు తెలంగాణ హైకోర్టు, సచివాలయం, నాగార్జునసాగర్ డ్యాం, శ్రీశైలం ఎడమగట్టు హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్, భూపాలపల్లి కేటీపీఎస్.. తదితర ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తున్నాయి. అలా ఈ రెండు విభాగాలకు రాష్ట్రవ్యాప్తంగా యూనిట్లు లేనందున జిల్లా కేడర్‌గా పరిగణించడం లేదు. పాత జోనల్ విధానంలోని ఉత్తరమండలం(నార్త్‌జోన్) పరిధిని కంటిగ్యుయెస్ డిస్ట్రిక్ కేడర్-1గా, పశ్చిమ మండలం(వెస్ట్‌జోన్) పరిధిని కంటిగ్యుయెస్ డిస్ట్రిక్ కేడర్-2గా పరిగణిస్తున్నారు. ఆయా మండలాల పరిధిలోని ప్రస్తుత కొత్త జిల్లాలకు చెందిన స్థానిక అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులుగా నిర్ణయించారు.