రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అధికారులు మెుదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతుండగా... నీటి ప్రవాహం పుష్కర ఘాట్లను ముంచెత్తింది. మహారాష్ట్ర, తెలంగాణలో భారీ వర్షాలతో పాటు ఎగువ ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12 మీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది.
వర్షార్పణం
పార్వతి బ్యారేజ్ 68 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంథని మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు చాలా వరకు నీటిలో మునిగిపోయాయి. మంథని పట్టణంలోని బొక్కల వాగు గోదావరిలో కలిసే ప్రాంతంలో వరద పోటెత్తడంతో ఎగ్లాస్పూర్ జలదిగ్భందంలో చిక్కుకుంది. గోదావరి ఒడ్డున ఉన్న శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయం చుట్టూ నీరు చేరటంతో 28 మంది ప్రజలు వరదలో చిక్కుకుపోయారు. వారిని ఒడ్డుకు చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మేడిగడ్డకు వరద
లక్మీ (మేడిగడ్డ) బ్యారేజీలో 85 గేట్లకు గానూ 70 గేట్లు ఎత్తారు. ఇన్‌ఫ్లో 9,65,030 క్యూసెక్కులు... అవుట్ ఫ్లో 9,65,030 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా... 8 టీఎంసీలకు చేరింది.