Two Army Helicopters To Moranchapalli : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదలపై ప్రగతి భవన్ నుంచే సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో భాగంగా పూర్తిగా నీట మునిగిన భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఈ మేరకు ముంపునకు గురైన మోరంచపల్లి గ్రామానికి రెండు సైనిక హెలికాప్టర్లను పంపుతున్నట్లు సీఎస్ తెలిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ల వినియోగం ఇబ్బందిగా మారతాయన్న ఆలోచనతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మిలటరీ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి.. ఈ నిర్ణయం తీసుకుంది.
సీఎం ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతం నుంచి మోరంచపల్లి గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బోట్లలో పునరావాస కేంద్రానికి తరలించారు. వరదలో చిక్కుకున్న ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర వరద ముంపు ప్రాంతాల్లో కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు :వరద బాధిత జిల్లాల్లో పరిస్థితులు, సహాయక చర్యలు పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకు పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. వీరు గతంలో ఆయా జిల్లాల్లో విధులు నిర్వర్తించిన అధికారులు కావడం విశేషం. ములుగు జిల్లాకు ప్రత్యేకాధికారిగా కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి జిల్లాకు గౌతమ్, నిర్మల్ జిల్లాకు ముషారఫ్ అలీ, మంచిర్యాల జిల్లాకు భారతి హోలికేరి, పెద్దపల్లి జిల్లాకు సంగీత సత్యనారాయణ, ఆసిఫాబాద్ జిల్లాకు హన్మంతరావును ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది.