జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో లక్ష్మీ(మేడిగడ్డ), సరస్వతి(అన్నారం) బ్యారేజీల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి శనివారం రాత్రి భారీగా వరద పెరగడంతో.. ఇప్పటికే 57 గేట్లు ఎత్తి ఉండగా.. ఆ సంఖ్యను 65కు పెంచారు. ఎగువ ప్రాంతం నుంచి 8,50,00 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటం వల్ల 65 గేట్ల ద్వారా 9,81,400 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. మేడిగడ్డ బ్యారేజీలో శనివారం సాయంత్రం వరకు 11.67 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. వరద తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
సరస్వతి (అన్నారం) బ్యారేజీకి మానేరు, ఇతర వాగులు, వంకల ద్వారా సుమారు 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కాగా.. 51 గేట్లు తెరిచి లక్ష 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అన్నారం బ్యారేజీ ప్రస్తుత నీటి నిల్వ 9.1 టీఎంసీలుగా ఉంది. లక్ష్మీ పంపుహౌస్ వద్ద 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నెలకొంది. వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో గేట్ల ఎత్తివేత, నీటి విడదల కొనసాగే అవకాశం ఉంది.