రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో ప్రవాహం జోరందుకుంది. ప్రాణహిత, గోదావరి సంగమం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీ గేట్లు తెరిచి 1.02 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ నీరంతా దిగువన కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజీకి (తుపాకులగూడెం) చేరుకుంటోంది. ఈ బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 6.97 టీఎంసీలు. ఎగువ నుంచి వస్తున్న 80వేల క్యూసెక్కులను 12 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. మరోవైపు ఏపీలోని ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 18 వేల క్యూసెక్కులు సముద్రంవైపు విడిచిపెడుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు నుంచి 5689 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయంలోకి 28వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 20.18 టీఎంసీలకు 16.46 టీఎంసీల నిల్వ ఉంది.
లక్ష్మీ బ్యారేజీ నుంచి పార్వతి, సరస్వతి బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి జూన్ 18 నుంచి జులై 9 వరకు 30 టీఎంసీలు నీటిని ఎత్తిపోశారు. ఎల్లంపల్లి నుంచి నంది, గాయత్రి ఎత్తిపోతల ద్వారా మధ్య మానేరుకు 24 టీఎంసీల వరకు నీటిని తరలించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన తొలకరి జల్లులతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.