తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు కాదు మూడు... అదనపు టీఎంసీ వరం! - kaleshwaram project 3rd tmc news

కాళేశ్వరం ప్రాజెక్టు మరో మైలురాయిని అందుకోనుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడో టీఎంసీ నీటిని మళ్లించే పనులు ఈ సీజన్‌లో ఆగస్టు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మోటార్లు అమర్చే పని జరుగుతోంది. రెండు పంపుహౌస్‌లలో అన్ని పనులు వచ్చే రెండు నెలల్లో పూర్తవుతాయి.

kaleshwaram project
kaleshwaram project

By

Published : Jun 21, 2020, 7:23 AM IST

కాళేశ్వరం ద్వారా మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఆదివారానికి ఏడాది పూర్తి కాగా ఈ సంవత్సరంలో 60 టీఎంసీలకు పైగా ఎత్తిపోశారు. ఒకవైపు నీటి ఎత్తిపోతను కొనసాగిస్తూనే అదనపు టీఎంసీ పనులను కూడా ఓ కొలిక్కి తెచ్చారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడో టీఎంసీ నీటిని మళ్లించే పనులు ఈ సీజన్‌లో ఆగస్టు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పంపుహౌస్‌లలో ప్రెషర్‌ మెయిన్‌లు, డెలివరీ సిస్టర్న్‌ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మోటార్లు అమర్చే పని జరుగుతోంది. రెండు పంపుహౌస్‌లలో అన్ని పనులు వచ్చే రెండు నెలల్లో పూర్తవుతాయి. ఒక పంపుహౌస్‌లో మాత్రం కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.

ముందే పూర్తయిన కాంక్రీటు పనులు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మళ్లిస్తోన్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు వచ్చేలోగా ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి పంపేందుకు శ్రీరామసాగర్‌ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద పూర్తి అవసరాలు, శ్రీరామసాగర్‌ పునరుజ్జీవ పథకానికి ఒక టీఎంసీ కలిపి రోజూ మూడు టీఎంసీలను మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సి ఉంటుంది. కొన్ని రిజర్వాయర్ల పనులు, కాలువ నిర్మాణాలు, డిస్ట్రిబ్యూటరీల పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో నీరందుతుంది.

భవిష్యత్తు అవసరాల కోసం

ఎల్లంపల్లి దిగువన అదనపు టీఎంసీ నీటిని మళ్లించే పనులకు ఇటీవలే ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. అయితే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి మేడిగడ్డ(లక్ష్మి), అన్నారం(సరస్వతి), సుందిళ్ల(పార్వతి) పంపుహౌస్‌లలో గత ఏడాదే పనులు చేపట్టింది. భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకుని మొదట రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించినప్పుడే మూడో టీఎంసీకి అవసరమైన కాంక్రీటు పనులను పూర్తి చేయించింది సర్కారు. మోటార్లు, పంపులు అమర్చడం, ప్రెషర్‌మెయిన్లు, డెలివరీ సిస్టం పనులు ఈ ఏడాది పూర్తికానున్నాయి.

  • మేడిగడ్డ వద్ద ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు పంపులు, మోటార్లకు గాను రెండు మోటార్లు, పంపులు అమర్చారు. మిగిలిన నాలుగింటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. జులై ఆఖరు లేదా ఆగస్టు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
  • అన్నారంలో నాలుగు పంపులు, మోటార్లకు ఒకటి అమర్చారు. మిగిలిన మూడు వచ్చే రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
  • ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసే సుందిళ్లలో ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. మోటార్లు అమర్చే పని ప్రారంభం కావాల్సి ఉంది. ఇక్కడ కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి కొన్ని మోటార్లు సిద్ధమయ్యే అవకాశం ఉంది. మొత్తమ్మీద ఈ ఏడాది వరద ఆగిపోక ముందే అదనపు టీఎంసీ నీటిని మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసే అవకాశం ఉందని సంబంధిత ఇంజినీరింగ్‌ వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే ఐదేళ్లలోనే రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కాళేశ్వరం పథకాన్ని పూర్తి చేసినట్లవుతుంది.

ఇదీ చదవండి:కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

ABOUT THE AUTHOR

...view details