కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు వెంటనే చెల్లించాలని.. డిమాండ్ చేస్తూ.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల పీఏసీఎస్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని తరుగు పేరుతో కోత విధించడం అన్యాయమని.. ఆ సొమ్మును వెంటనే చెల్లించాలంటూ రుద్రారం, తాడిచెర్ల గ్రామాలకు చెందిన 100 మంది రైతులు గురువారం తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం ఎదుట బైఠాయించారు. దాదాపు నాలుగు గంటల పాటు రైతులు ఆందోళన నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దండు రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితెల రాజయ్య రైతుల ధర్నాకు మద్దతు ప్రకటించారు.
నిబంధనలు పాటించలేదు..
రైతుల సొమ్ము అక్రమంగా స్వాహా చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పీఏసీఎస్ సిబ్బంది, బినామీలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. వారి వద్ద రైతుల సొమ్మును రికవరీ చేయాలని.. ఇందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామారావు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బస్తాకు 40 కిలోల 700 గ్రాములు తూకం వేయాలనే నిబంధనలు తుంగలో తొక్కి బస్తాకు 42 కిలోల చొప్పున తూకం వేసుకుని అదనంగా తరుగు పేరుతో మరో ఐదు కిలోలు దోచుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంమై ఛైర్మన్ రామారావు వాహనాన్ని అడ్డుకుని నిలదీయగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.