అకాల వర్షంతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కురిసిన భారీ వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని.. భూపాలపల్లి, చిట్యాల, రేగొండ, టేకుమాట్లా, ఘనపురం, మొగుళ్లపల్లి, మండలాల్లో రైతులు శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పంట కల్లాలలో, కేంద్రాలలో కళ్ల ముందే తడిసిపోతుంటే రైతు కష్టాన్ని చూసి దిగులు చెందుతున్నారు.
15 రోజులుగా కేంద్రాల వద్దే..
వీటికి తోడు అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు పెద్ద సమస్యగా మారింది. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట చేతికొచ్చి నెలలు గడుస్తున్నా మొక్కజొన్నలు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్ని సంచులు ఇవ్వకపోవడం, కాంటా జోకితే రూ.40 నుంచి 70 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంటా అయిన కూడా కేంద్రాల వద్దే 15 రోజులుగా ఉంటున్నాయని.. లారీ ఎక్కేవరకు రైతు బాధ్యతే అనడం వల్ల అన్నదాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం..
శుక్రవారం రాత్రి భారి వర్షం కురవడం వల్ల కేంద్రాల వద్ద ఉన్న మొక్కజొన్నలు, వరి ధాన్యం తడిసి పోయాయి. రేగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో దోపిడీ జరుగుతోందని రైతులు మండిపడ్డారు. మొక్కజొన్నలు తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని అరబెట్టేందుకు రైతులు కేంద్రాల వద్ద ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం అధికారులు, రైతులపై దయచూపి తడిసిన ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కొనుగోలు చేసి ఆదుకోండి
రాత్రనక, పగలనక కేంద్రాల వద్దకు వచ్చి పోసిన పంటలను చూసుకొని పోతున్నారే తప్ప, అనుకున్న సమయంలో పండించిన పంటలు కొనుగోలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో గన్ని బ్యాగులు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వెంటనే తడిసిన పంటలను కూడా ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
అకాల వర్షంతో తడిసిన ధాన్యం.. ఆదుకోవాలని రైతన్నల విజ్ఞప్తి ఇవీ చూడండి: జూన్ 30 వరకు లాక్డౌన్ 5.0- కీలక మార్గదర్శకాలు ఇవే