రాష్ట్రంలో భారీ వర్షాలకు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరదపోటెత్తుతోంది. వరద వల్ల వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లిలో... ఎల్లయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తి, మిర్చి పంటలు నీటమునగడంతో అప్పులు తీర్చలేననే బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
న్యాయం జరగడం లేదు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల బ్యాక్‌వాటర్‌తో... పంటలు మునిగి నష్టపోతున్నామని అన్నదాతలు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీ కార్యాలయం వద్ద బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. మహదేవపూర్ మండలంలో సూరారం, అన్నారం, అంబట్‌పల్లి, చంద్రుపల్లి, మద్దులపల్లి, పలుగుల, కుంట్లము గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అన్నదాతలు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్తున్నా... తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు.
మా పొలాలు అన్నారం బ్యారేజీ దిగువన ఉన్నాయి. రెండోసారి రూ. లక్షన్నర పెట్టుబడి పెట్టి వరినాట్లు వేశాను. భారీ వర్షాలతో పంట నీట మునిగింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. బాధిత రైతు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
భారీ నష్టం
నిజామాబాద్ జిల్లాలోనూ వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. బోధన్ మండలం హాంగర్గలో పంటనష్టాన్ని అధికారులు అంచనా వేశారు. బాధిత ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సహా ఇతర అధికారులు తొట్టిసాయంతో పర్యటించారు. శ్రీరాంసాగర్ నీళ్లు భారీగా రావడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని గ్రామస్థులు అధికారులకు తెలిపారు. నవీపేట్ మండలం యంచ నుంచి అల్జపూర్‌కు వెళ్లే రహదారిపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. రాకపోకలు నిలిచిపోయాయని... అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.