జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లికి చెందిన కృష్ణమూర్తి అనే రైతు సమీకృత వ్యవసాయం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తనకున్న 10 ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ఔషధ మొక్కలను సైతం పెంచుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్, ఆవాలు, అగర్‌వుడ్ లాంటి అరుదైన పంటలు సాగు చేస్తున్నారు. ఇందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి విత్తనాలు సేకరిస్తున్నారు. గత రెండేళ్లుగా డ్రాగన్ పంట వల్ల.. మెదటి ఏడాది రూ.50 వేలు, రెండో ఏడాది రూ.80 వేలు లాభం పొందినట్లు తెలిపారు.
అదనపు ఆదాయం..
విభిన్న పంటలు సాగు చేస్తూనే.. అంతర పంటలు వేసి అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ ఏడాది అంతరపంటగా ఆవాలు, టమాట, పుదీన, వాము సాగు చేసినట్లు వెల్లడించారు. వరి, పత్తి, మిర్చి సాగు చేయటం వల్ల నష్టాలు వచ్చాయని.. అందువల్లే దీర్ఘకాలిక పంటలవైపు మెగ్గు చూపినట్లు కృష్ణమూర్తి తెలిపారు. ఇప్పటికే మలబార్, వేప, శ్రీగంధం, టేకు చెట్లు పెంచుతున్నారు. తరుచూ శ్రమించాల్సిన పని లేకుండా.. దీర్ఘకాలికంగా ఎక్కువ ఆదాయం వస్తోందని కృష్ణమూర్తి వెల్లడించారు.