FARMER COMMITS SUICIDE: భూమి విక్రయ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా,చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పడిదల సంపత్ రావు సంవత్సరం క్రితం అదే గ్రామానికి చెందిన వ్యక్తికి భూమిని విక్రయించారు. ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో లేకపోవడంతో డబ్బులు చెల్లించే విషయంలో జాప్యం జరగుతుంది.
పలుసార్లు పెద్ద మనుషుల్లో పంచాయతీలు జరిగాయి. దీనిపై పోలీస్స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తలదూర్చడంతో మరింత వివాదంగా మారింది. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన సంపత్ రావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయణ్ను చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు చిట్యాల రహదారిపై ధర్నా చేపట్టారు. అతని ఆత్మహత్యాయత్నానికి అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులే కారణమని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.