Moranchapalli Flood Victims Problems : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని వరద నీరు ముంచెత్తిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రి వరద ముంచెత్తడంతో మోరంచపల్లివాసులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. ప్రభుత్వ పరిహారం, దాతల సహాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు మానవతామూర్తులు వారికి అండగా నిలుస్తున్నారు. తమకు తోచినంత సాయం చేస్తూ.. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. బంధువులు, మిత్రులు, స్వచ్ఛంద సంస్థలు, పలువురు దాతలు.. ఇలా ఎంతోమంది కష్టకాలంలో వారికి అండగా నిలుస్తున్నారు.
తాజాగా కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తెలంగాణ అంధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం మరియు బ్యాంకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోరంచపల్లి గ్రామస్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేదలకు తమవంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నిత్యావసరాలు అందించినట్లు అంధ ఉద్యోగులు కార్తీక్, రాజకుమార్, రవీందర్, రాజు, శ్రీనివాస్, కమల, నవనీతలు తెలిపారు.
మాకు కళ్లు కనపడకున్నా భగవంతుడు ఉద్యోగ అవకాశం కల్పించాడు. అందుకే మా వంతుగా కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సహాయం చేయాలని తలా కొంత డబ్బులు జమ చేసుకొని ముందుకు వచ్చాం. తెలంగాణ అంధ ఉద్యోగ, ఉపాధ్యాయ, బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మోరంచపల్లి బాధిత 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. పేదలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి వరకు వచ్చి బాధితులకు సహాయం చేస్తున్నాం.- అంధ ఉద్యోగులు
మోరంచపల్లికి సంబంధించిన వీడియోలను చూసి చలించిపోయిన పలువురు కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సభ్యులు శ్రీనివాస్, మురళి, గిరి బాబు, కుమారస్వామి.. యూఎస్‌ఏ నుంచి వచ్చి బాధితులకు నేరుగా సరుకులు అందించారు. గ్రామ పెద్దలతో మాట్లాడి.. సమస్యలు తెలుసుకుని తమకు తోచినంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు.