Crops Damaged Due to Hail Rains in Joint Warangal District : ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను అకాల వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్లముందే నేలపాలయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, గణపురం, రేగొండ, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో వడగళ్ల వానకు కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట తడిసి ముద్దయింది. మొక్కజొన్న పంట ఈదురుగాలులకు నేలకొరిగింది. మామిడి కాయలు రాలిపోయాయి. రెక్కల కష్టం వర్షార్పణమైందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 15రోజులైతే పంట అమ్ముకునేవారమని వాపోయారు.
నేలరాలిన మామిడి ప్రభుత్వమే ఆదుకోవాలి : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెలి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ, గీసుగొండ మండలాల్లో మామిడి తోటలు బాగా దెబ్బతిన్నాయి. వడగళ్లతో పూత, కాతతోపాటు మోస్తరు కాయలన్నీ నేలరాలాయి. ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి రైతులు వేడుకుంటున్నారు. అకాల వర్షబీభత్సానికి మిరప, అరటి మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో మిర్చిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
విరిగిన భారీ చెట్లు నిలిచిన రాకపోకలు :మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులు, వడగళ్ల వానకు చేతికంది వచ్చిన మామిడి, నిమ్మ, సపోటా, జామ తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పొట్ట దశకు వచ్చిన వరి పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యయి. మొక్కజొన్న, మిర్చి, పెసర, కొత్తిమీర పనికిరాకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ శివారులో చెట్టు పడి శంకర్ అనే రైతు మృత్యువాతపడ్డాడు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై భారీ చెట్లు విరిగిపడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. పోలీసులు యంత్రాల సాయంతో తొలగించారు. నర్సంపేట నియోజకవర్గం పరిధిలో వడగళ్ల వానకు మామిడి తోటలు తీవ్రంగా నష్టపోయాయి.