తెలంగాణ

telangana

ప్రతినీటి బొట్టూ వినియోగించేలా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ఎస్సారెస్పీ, దేవాదుల నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టును వినియోగించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. అందరికీ సాగునీరు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్​లతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నీటిపారుదలపై సమీక్ష నిర్వహించారు.

By

Published : Nov 11, 2020, 9:24 AM IST

Published : Nov 11, 2020, 9:24 AM IST

collector review on irrigation department in jayashankar bhupalpally district
ప్రతినీటి బొట్టూ వినియోగించేలా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ఎస్సారెస్పీ, దేవాదుల, మైనర్ ఇరిగేషన్ నీటితో అందరికీ సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం చెల్పూర్​లోని జెన్కో అతిథిగృహంలో దేవాదుల, మైనర్ ఇరిగేషన్, ఎస్సారెస్పీ కాలువల ద్వారా భూపాలపల్లి నియోజకవర్గంలో సాగునీరు సరఫరాపై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్​లతో కలిసి సమీక్షించారు. వ్యవసాయం ప్రధానంగా గల జిల్లాలోని ప్రతి పంట చేనుకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

ఎస్సారెస్పీ, దేవాదుల ఇంజినీర్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి దేవాదుల ఎత్తిపోతల పథకం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటి వనరులను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. అదనంగా అవసరమయ్యే పిల్ల కాలువల ఏర్పాటు, మరమ్మతు పనులను గుర్తించి నివేదికలు అందజేయాలని అన్నారు. వివిధ చెరువులు, ప్రాజెక్టుల మరమ్మతు పనులను గుర్తించి... వాటి పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపించాలని కోరారు. వానాకాలం నాటికి తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి వనరులను సద్వినియోగం చేయాలని సూచించారు.

భూమిని గుర్తించండి

సాగునీటి సరఫరాకు వీలున్న ప్రతి చోట మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించాలని ఆయన వివరించారు. పంట కాలువల ఏర్పాటుకు అవసరమైన భూమిని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గుర్తించి నివేదిక అందజేస్తే భూసేకరణ కార్యక్రమం చేపడతామన్నారు. ఇరిగేషన్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో రూ.76 కోట్లతో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

ప్రతి బొట్టుని వినియోగించాలి

జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటించిన సీఎం కేసీఆర్... ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గల చెరువులను నింపి... సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. భీమ్ ఘన్పూర్ చెరువును పటిష్ఠం చేసి దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలో అధిక మొత్తంలో సాగునీరు సరఫరా చేయడమే కాకుండా తాగునీరు అవసరాలు తీర్చేదిగా తీర్చిదిద్దాలని, ఎస్సారెస్పీ నుంచి వచ్చే ప్రతి నీటిబొట్టును పంట పొలాలకు మళ్లించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

సస్యశ్యామలం చేయాలి

అందరూ చిత్తశుద్ధితో పనిచేసి సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా దేవాదుల, మైనర్ ఇరిగేషన్, ఎస్సారెస్పీ నీటిని పొలాలకు మళ్లించి సస్యశ్యామలం చేయాలని లోక్ సభ సభ్యులు పసునూరి దయాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, దేవాదుల సీఈ బంగారయ్య, ఎస్ఈ సుధాకర్ రెడ్డి, ఎస్సారెస్పీ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్​ఈ రమేశ్, ఈఈ జగదీశ్, డీఈ ప్రసాద్, ఆర్​డబ్ల్యూఎస్ ఎస్ఈ మాణిక్యరావు, ఆర్డీవో శ్రీనివాస్, భూపాలపల్లి మున్సిపల్ ఛైర్​పర్సన్ షెగ్గెం వెంకటరాణి, జడ్పీ వైస్ ఛైర్​పర్సన్ కళ్లెపు శోభ, భూపాలపల్లి నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ నీటిపారుదల శాఖల డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'వరద బాధితులకు సాయం పంపిణీ చేయకపోతే కాలనీల్లో తిరగనివ్వం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details