వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున నిర్ణీత లక్ష్యం మేరకు అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అజీం అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి క్లబ్ హౌజ్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిరుపేద రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని.. వారికి సకాలంలో పంట రుణాలు అందించి సాగు చేసుకునేందుకు సహకరించాలని బ్యాంకర్లను ఆదేశించారు.
ఆయా మండలాల తహశీల్దార్లు మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ క్షేత్రాల్లో మోకాపై ఉన్న రైతులను గుర్తించి పట్టాదారు పాసు పుస్తకాలు త్వరగా అందించాలని, నకిలీ పట్టాదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలా చేయడం వల్ల అర్హులైన రైతులకు పంటరుణం తొందరగా, సక్రమంగా అందుతుందని అన్నారు.