రక్తదానం ప్రాణదానంతో సమానమని.. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గ్రామానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులను అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
మరో ప్రాణం కాపాడవచ్చు..
ప్రమాదాలు జరిగినప్పుడు రక్తస్రావం కావడం వల్లే 90 శాతం మరణాలు సంభవిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. అలాంటి బాధితులకు సకాలంలో రక్తం అందిస్తే ప్రాణాలు నిలబడతాయని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రక్తదానం చేయడం వల్ల మరో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వారవుతారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బ్లడ్ స్టోరేజీ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు చర్యలు జరుగుతున్నాయన్నారు.