భూపాలపల్లి పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ఇళ్లల్లో తడి, పొడి చెత్తను ప్రతిరోజు సేకరించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే వార్డుల్లో సిబ్బందిని కేటాయించి శానిటేషన్ ఆటో రిక్షాల ద్వారా వేరుగా సేకరించాలన్నారు.
పకడ్బందీగా..
భూపాలపల్లి మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్న శానిటేషన్ పనులు పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించేందుకు రెగ్యులర్ నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తున్నందున పకడ్బందీగా చేపట్టాలని పేర్కొన్నారు.
శానిటేషన్ ఆటో రిక్షాలో చెత్త వెయ్యకుండా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వేసే ఇంటి యజమానులకు ఫైన్ వేయాలని సూచించారు. పన్నుల వసూళ్లలో మున్సిపాలిటీ వెనుకంజలో ఉన్నందున బిల్ కలెక్టర్లను బాధ్యులుగా చేస్తూ 100% వసూలు చేయించాలన్నారు.