కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాణహిత నుంచి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వరద వస్తున్న దృష్ట్యా... గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తర్వాత తొలిసారిగా సందర్శించిన సీఎం కేసీఆర్ జలాశయాల వద్ద నీటి నిల్వను స్వయంగా పరిశీలించారు. విహంగ వీక్షణం ద్వారా గోదావరి పరవళ్లను చూసి పులకించిపోయారు.
గంగమ్మకు పూజలు
బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అధికారులు, ఇంజినీర్లతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత మేడిగడ్డ బ్యారేజికి చేరుకున్నారు. మేడిగడ్డ వద్ద వర్షపు జల్లుల్లోనే బ్యారేజీపై కాలినడకన పర్యటించారు. వారం రోజులుగా ప్రాణహిత, గోదావరి నదుల ద్వారా వస్తున్న వరద నీరు, ప్రస్తుత బ్యారేజీ నీటి మట్టాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 32 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్న వరద ప్రవాహాన్ని సీఎం వీక్షించారు. గోదావరి మాతకు పూజలు నిర్వహించి... పూలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. గోదావరి జలాల్లో నాణాలు విడిచారు. ఆ తర్వాత అధికారులు, ఇంజినీర్లతో కలిసి విహంగ వీక్షణం చేశారు.
అప్పుడు వెలవెల... ఇప్పుడు బిరబిర
జలకళ సంతరించుకున్న మేడిగడ్డ బ్యారేజీని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పులకించిపోయారు. నిండుకుండలా బ్యారేజీ కనబడుతోందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఎండాకాలంలో బ్యారేజీ నీటిలో నడిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 45 లక్షల ఎకరాలకు సాగునీరు సహా పారిశ్రామిక అవసరాలు, 80 శాతం రాష్ట్రానికి తాగునీటిని అందించే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తిచేసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. బ్యారేజీ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.