ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో కేవలం రూ.28వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. రాష్ట్ర ప్రజల నిధులను తెరాస ప్రభుత్వం దోపిడీ చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో భట్టి పర్యటించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ మధుయాష్కీతో కలిసి కాళేశ్వరాన్ని సందర్శించారు.
గురువారం రాత్రి కాళేశ్వరానికి చేరుకున్న నేతలు.. స్థానిక హోటల్లో బస చేసి ఇవాళ ఉదయం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూసుకుపల్లి, మద్దులపల్లి, చండ్రుపల్లి, అన్నారం మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సరస్వతీ(అన్నారం)బ్యారేజీని సందర్శించి పరిశీలించారు. బ్యారేజీ పనితీరుపై ఇరిగేషన్ అధికారులు వివరించారు.