Clash between Congress BRs in Bhupalapalli: "హాథ్ సే హాథ్ జోడో యాత్ర" లో భాగంగా జయశంకర్ భూపాలపల్లికలో రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మొదలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య రేగిన రాజకీయ చిచ్చు ఇంకా రాావణకాష్ఠంలా కాలుతూనే ఉంది. జిల్లాలో ఎక్కడిక్కడ ఇవాళ కూడా కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోనేందుకు యత్నించారు.
జిల్లాలోని టేకుమట్ల మండల కేంద్రంలో ఇరు పార్టీలకు చెందిన వందలమంది కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పోటాపోటీగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను, కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి దిష్టిబొమ్మలను తగలపెట్టే పయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగటంతో ఇరు పార్టీలోని కొందరి నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటానాస్థలికి చేరుకొని ఇరువార్గాల వారిని చెదరగొట్టారు. దీంతో వివాదం ప్రస్తుతం కాస్త సద్దుమణిగినా.. ఎప్పుడు ఏం జరుగుతోందోనని స్థానిక ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు.
వివాదం ఇలా మొదలైంది:టీపీసీసీ అధ్యక్షుడురేవంత్‌రెడ్డి చేస్తున్న"హాథ్ సే హాథ్ జోడో యాత్ర" ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతోంది. నిన్న ఉదయం జిల్లాలోని కాశీంపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేసిన రేవంత్.. రాత్రి భూపాలపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ క్రమంలో సుమారు వంద మంది బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ సభ వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అక్కడితో ఆగకుండా సభపైకి కోడుగుడ్లు, టమాటోలు, రాళ్లు విసిరారు. రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొందరు రాళ్లు విసరడంతో అక్కడున్న నాయకుల సాలువా అడ్డుపెట్టి రాళ్లు పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. వారు కూడా బీఆర్ఎస్ నాయకులపై రాళ్లు రువ్వడంతో అక్కడ పరిస్థితి కాస్త గందరగోళం, భయందోళనకరంగా మారింది. పరిస్థితిని గమనించిన పోలీసులు ఇరువర్గాలు వారిని చెదరగొట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తలను స్థానిక థియేటర్లో బంధించారు. దీంతో థియేటర్‌పై రాళ్లు విసరడంతో వాటి అద్దలు పగిలాయి. స్థానిక ఎస్సై శ్రీనివాస్‌కు తలకు గాయం కాగా ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. తాజా ఘటనలతో ఏ నిమిషం ఏం జరుగుతోందని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.