జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాగులు ఎక్కువగా ఉన్నాయి. చలివాగు, మోరంచవాగు, కాల్వపల్లి, బొగ్గులవాగులతో నిత్యం జలకళ సంతరించకుని ఉంటుంది. పుష్కలమైన నీటి వనరులున్నా వృథాగా పోతున్నాయి.. ఈ నీటి వనరులను ఒడిసిపట్టి వినియోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. భూపాలపల్లి నియోజకవర్గంలో 10 ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు నిర్మించాలని తలపెట్టారు. రెండేళ్ల క్రితమే వీటికి ప్రణాళికలు సిద్ధం చేయించి, నిధులు మంజూరు అయ్యాయి. పనులకు మాత్రం మోక్షం కలగడం లేదు.
పట్టాలెక్కని పనులు..
రేగొండ మండలంలో చలివాగుపై దామరాంచపల్లి, రాజక్కపల్లిలో, టేకుమట్ల మండలంలో వెలిశాలలో చలివాగుపై, చిట్యాల మండలంలో పెద్దవాగుపై, గణపురం మండలంలో మోరంచవాగుపై రెండు చోట్ల, భూపాలపల్లి మండలంలోని బొగ్గులవాగుపై ఒకటి, పెద్దవాగుపై మరొక చెక్‌డ్యాం, మొగుళ్లపల్లి మండలంలో మోరంచవాగుపై ఇస్సీపేట, పోతుగల్లులో చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి. మొత్తం 10 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు రూ.40 కోట్లు మంజూరయ్యాయి. గతేడాదే టెండర్లు పూర్తయ్యాయి. మొగుళ్లపల్లి, భూపాలపల్లి, గణపురం మండలాల్లోని 6 చెక్‌డ్యాంలకు సంబంధించి టెండర్ల విషయంలో కోర్టుకు వెళ్లడంతో పనులు మొదలు కాలేదు. తిగిరి ఏడాది కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యాయి. అయినా పనులు మొదలు పెట్టడంలో జాప్యం చేస్తున్నారు. రైతులకు ఈ చెక్‌డ్యాంలతో నీటి వసతి పెరుగుతుందని భావించినా మోక్షం కలగడం లేదు.
ప్రారంభమైన చోట రైతుల అసంతృప్తి..
టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్(వి), గుమ్మడివెల్లి గ్రామాల మధ్య రూ.10 కోట్లతో నిర్మిస్తున్న చెక్‌డ్యాంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. పనులు ప్రారంభమై 60శాతం పనులు కూడా పూర్తయ్యాయి. కాని రైతులు వీటిని వ్యతిరేకిస్తున్నారు. వెలిశాల నుంచి చెరువు మత్తడి నీరు, నిర్మించే చోట మూలమలుపు ఉండటంతో వరద నీరు పొలాలవైపే దూసుకొస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు రామకృష్ణాపూర్‌లోని పంట పొలాలు కొట్టుకుపోయాయి. తాము వేసుకున్న మట్టి కట్టను కూడా తొలగించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న చోటుకు వంద మీటర్ల ముందు నిర్మిస్తే పంట పొలాలకు ముప్పు వాటిల్లకుండా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బయటపడుతున్న లోపాలు..
పది చెక్‌డ్యాంలలో ఒకటే నిర్మిస్తున్నా పనులు నాసిరకంగా చేపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పనులు నిలిపివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక నిర్మాణ ప్రదేశాలను పరిశీలిస్తే సిమెంట్ బెడ్‌పై అక్కడక్కడ పగుళ్లు వచ్చాయి. కంకర తేలిపోయి, ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. అలాగే దిమ్మెకు సైతం పగుళ్లు బారి కనిపిస్తున్నాయి. కంకర కూడా ద్వితీయ శ్రేణిదే వినియోగిస్తున్నారు. హడావుడి పనులు చేపట్టి నిలిపివేశారు. ఇప్పటికైనా నాణ్యతతో నిర్మించాలని, మిగతా చెక్‌డ్యాంలను త్వరగా పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.
ఐదెకరాల్లో నష్టం వాటిల్లింది..