Bhupalapally On Flood Damage Survey Central Team : భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన మోరాంచపల్లి గ్రామాన్ని ఏడుగురు సభ్యలతో కూడిన కేంద్ర బృందం సందర్శించారు. ముందుగా కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీడియోల ద్వారా వరద నష్టం పరిస్థితిని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం మోరాంచపల్లె గ్రామం వద్ద వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయిన రోడ్డు ,బ్రిడ్జ్, ఇండ్లను పరిశీలించారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించి అన్ని విధాల ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. నష్టం అంచనా వేసి నివేదిక త్వరగా ఇవ్వాలని కేంద్ర బృందం జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చింది. జిల్లాలో నలుగురు గల్లంతయ్యారని.. ముగ్గురి మృత దేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. మరో ఒకరి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు.
Warangal Flood Damage 2023 : జిల్లా వ్యాప్తంగా సుమారు 330 కోట్ల నష్టం వాటిలిందని, 15 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. 200 పాడి గేదెలు మృతి చెందాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వరద నష్టం జరిగిన ప్రజలకు రూ.10,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ.. ముంపు ప్రాంతాల సమస్యలను కేంద్ర బృందం తెలుసుకుంది. బాధితులు తాగేందుకు నీళ్లు కూడా లేవని బృందానికి తెలియజేశారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో పరిశీలించి వరద ముంపునకు గురైన ప్రాంతాల తీవ్రతను.. నష్టాన్ని అంచనా వేసింది.
Central Team in Mulugu District : కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వాటిపై పరిశీలించేందుకు కేంద్ర బృందం ములుగు జిల్లా కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులు, వాగులు, వర్ష ప్రభావంతో తెగిపోయిన కుంటలు, రోడ్లు, మృతి చెందిన పశువులు, వరదల్లో గల్లంతయిన వారి సంఖ్య.. ఇతర అంశాలు జిల్లా కలెక్టర్ త్రిపాఠిని అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ కృష్ణ ఆదిత్య కేంద్ర బృందానికి వివరించారు.
Central Team in Khammam: గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించి వరదల కారణంగా నష్టపోయిన గ్రామాలను కేంద్ర బృందం సభ్యులు సందర్శిస్తారు. బాధితులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకోనున్నారు. రెండు రోజుల ఉమ్మడి వరంగల్ జిల్లాపర్యటన ముగించుకుని గురువారం ఉదయం భద్రాచలం వెళ్లి అక్కడ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ మీదుగా దిల్లీకి బయళ్దేరనున్నారు.