Kishan Reddy challenge to KCR: సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బొగ్గుగనులకు సంబంధించిన దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే సింగరేణికి వాటిని కేటాయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి ఎందుకు దరఖాస్తు చేయలేదని ఆయన ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులతో సమావేశం అయ్యారు. వారితో కలిసి భోజనాలు చేశారు. సింగరేణి కార్మికులకు ఇళ్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఏమైందన్నారు. సింగరేణి కార్మికుల కోసం 4 ఆస్పత్రులను కట్టిస్తామని 2016లో కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఇప్పటివరకు ఆ హామీపై అతీగతి లేదన్నారు. కేసీఆర్ సర్కార్ సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. తెరాస పాలనలో సింగరేణి పరిరక్షణకు ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కోల్ బ్లాకుల విషయంలో కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. యూపీఏ హాయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బొగ్గు గనులను ప్రైవేట్‌పరం చేశారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల ప్రభుత్వం కనిపించకుండా పోతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు తెరాసలో ఉన్నారని.. ఉద్యమంలో పోరాడిన వారందరిని పార్టీ నుంచి తరిమేసిన ఘనత కేసీఆర్‌దని ఆయన విమర్శించారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన చాలా మంది వీరుల కుటుంబాలను సీఎం ఆదుకోలేదని ఆరోపించారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లోనైనా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా కేసీఆర్ అంటూ కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.