ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఇచ్చే తీర్పు తెరాస పతనానికి నాంది కావాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సీఎం కేసీఆర్ను ఎదిరించే సత్తా ఒక్క భాజపాకే ఉందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. భూపాలపల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.
తెరాసకు బుద్ధి చెప్పే ఏకైక పార్టీ భాజపా : డీకే అరుణ - bjp campaign for graduate mlc election
తెలంగాణలో తెరాసకు బుద్ధి చెప్పే ఏకైక పార్టీ భాజపా అని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో.. తీసుకొచ్చిన తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా.. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని అరుణ మండిపడ్డారు. తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదని, నిరుద్యోగులకు జీవనభృతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయులను పట్టించుకున్న దాఖలాలే లేవని దుయ్యబట్టారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పట్టభద్రులంతా ఈ ప్రభుత్వ తీరును ఎండగట్టాలంటే కమలం గుర్తుకు ఓటు వేయాల్సిందేనని డీకే అరుణ స్పష్టం చేశారు. భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమిందర్ రెడ్డికి పట్టం కట్టాలని కోరారు.
- ఇదీ చూడండి :నిగ్గుతేలని ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణం!