పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీట మునిగిన వరి, పత్తి పంటలను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ ఎడ్లబండిపై వెళ్లి పరిశీలించారు. రైతులు అధైర్య పడవద్దని... పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని అన్నారు. మల్హర్ మండలంలోని మల్లారం, రావులపెల్లి గ్రామాల్లో నీట మునిగిన, ఇసుక మేటలు వేసిన పొలాలను, ప్రమాదకరంగా మారిన ఆరే వాగు బ్రిడ్జిని, మానేరు ఉద్ధృతిని ఎడ్లబండిపై వెళ్లి విస్తృతంగా పరిశీలించారు.
ఎడ్లబండిపై వెళ్లి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ - భూపాలపల్లి జిల్లా వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని గ్రామాల్లో కలెక్టర్ మహమ్మద్ అజీమ్ పర్యటించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నీట మునిగిన పంట పొలాలను ఎడ్లబండిపై వెళ్లి పరిశీలించారు. రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
నీట మునిగిన వరి, పత్తి, నేలమట్టమైన ఇళ్లపై సర్వే నిర్వహించి జాబితా అందజేయాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండలంలో మూడు వేలకు పైగా పత్తి, వరి పంటలు నీట మునిగినట్లుగా తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఇనుప రాడ్లు తేలి ప్రమాదకరంగా మారిన ఆరే వాగు బ్రిడ్జిపై ఉన్న గుంతలను పూడ్చాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. నీటిలో కొట్టుకుపోయిన మోటార్లను సబ్సిడీపై అందజేయాలని కలెక్టర్‌ను ఎంపీపీ మల్హర్ రావు విన్నవించారు. నీట మునిగిన వరి పొలాలకు ఎకరాకు ఇరవై వేల చొప్పున పరిహారం అందజేయాలని విన్నవించారు.
ఈ పర్యటనలో మల్హర్ ఎంపీపీ చింతపల్లి మల్హర్ రావు, మండల ప్రత్యేక అధికారి సుదర్శన్, తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి మహేష్, పశువైద్యాధికారి జలపతి రావు, డీటీ శ్రీనివాస్, ఆర్ఐ సరిత, ఎంపీటీసీ ప్రకాష్ రావు, స్థానిక సర్పంచ్ గోనె పద్మ శ్రీనివాస్ రావుతో పాటు రైతులు పాల్గొన్నారు.