Barricades on Medigadda Barrage in Telangana: కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీలో ఒకటైన మేడిగడ్డ బ్యారేజీ దగ్గర అధికార సిబ్బంది బారికేడ్లులను ఏర్పాటు చేశారు. బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ కుంగిపోయి దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపివేశారు. ఇప్పటికీ మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బ్యారేజీ వైపు ఎవరూ వెళ్లకుండా సంస్థ ప్రతినిధులు, అధికారులు పెద్దరేకులను అడ్డుపెట్టి దారిని మూసివేశారు.
అధికారులను, సిబ్బందిని మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నారు. మరోవైపు ఏడో బ్లాక్ పరిధిలో పనులు కొనసాగుతున్నాయి. నీటిని మళ్లించినా ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 26,350 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. 61 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నదిలో కాఫర్ డ్యాం పనులు(Cofferdam Works) కొనసాగుతున్నాయి.
Meddigadda Barrage Issue: అక్టోబర్ 21న భారీ శబ్దంతో మేడిగడ్డ బ్యారేజీలోని 20వ పిల్లర్ కుంగిపోయింది. కాంక్రీట్ నిర్మాణానికి క్లస్ట్ గేట్లకు మధ్య పగుళ్లు ఏర్పడ్డాయి. 7వ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల దగ్గర కుంగిపోయింది. అనంతరం ప్రాజెక్ట్‌కు ఎలాంటి నష్టం రాకుండా యుద్ద ప్రాతిపదికన గేట్లు ఎత్తివేసి.. నీటిని దిగువ ప్రాంతానికి మళ్లించారు. సందర్శనను నిలిపివేసి.. 144 సెక్షన్ అమలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది.
BJP Leaders Team Visit Meddigadda Barrage : అక్టోబర్ 24న నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం ఆరుగురు సభ్యులతో సందర్శించి.. నివేదికను సిద్దం చేసింది. రాజకీయ నాయకులు ఈ విషయంపై పలు చర్చలు చేశారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి.. కుంగిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధుల బృందం(BJP Leaders Team) సందర్శించింది. కుంగిన పిల్లర్లను కిషన్‌రెడ్డితో పాటు లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు పరిశీలించారు.