తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణహిత పుష్కరాలకు ముస్తాబవుతున్న కాళేశ్వరం.. నత్తనడకన ఏర్పాట్లు - ts news

Pranahitha Pushkaralu: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ప్రాణహిత పుష్కరాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 13 నుంచి ప్రాణహిత నదికి పుష్కరాలు జరగనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. కానీ పుష్కరాల నేపథ్యంలో భక్తుల సౌకర్యాలకు సంబంధించి ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి.

ప్రాణహిత పుష్కరాలకు ముస్తాబవుతున్న కాళేశ్వరం.. నత్తనడకన ఏర్పాట్లు
ప్రాణహిత పుష్కరాలకు ముస్తాబవుతున్న కాళేశ్వరం.. నత్తనడకన ఏర్పాట్లు

By

Published : Apr 9, 2022, 4:11 AM IST

Pranahitha Pushkaralu: త్రివేణి సంగమమైన కాళేశ్వరం ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. ఒకే పానపట్టంపై రెండు శివలింగాలు ఇక్కడ ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా భావించి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనాలు చేసుకుంటుంటారు. గోదావరి, ప్రాణహిత.. అంతర్వాహినిగా సరస్వతీ నది కలయికతో ఈ ప్రాంతాన్ని త్రివేణీ సంగమం అని పిలుస్తారు. అందుకే ఇక్కడ మూడు నదులకు సంబంధించిన పుష్కరాలు జరుగుతాయి. ఇందులో భాగంగా ప్రాణహిత పుష్కరాలకు సమయం సమీపించింది. ఈ నెల 13 నుంచి 12 రోజులపాటు పుష్కరాలు జరగనున్నాయి.

ప్రాణహిత పుష్కరాలకు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా తుమ్మిడిహట్టి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, అర్జునగుట్ట, దేవులవాడ, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పుష్కరాలు జరుగుతుండగా.. ఎక్కడా ఏర్పాట్లు పూర్తిస్ధాయిలో కాలేదు. కాళేశ్వరంలో ఇప్పుడే పుష్కర ఘాట్ల వద్ద బారికేడ్ల నిర్మాణం జరుగుతోంది. చలువపందిళ్లు వేస్తున్నారు. ఇంకా మరుగుదొడ్ల నిర్మాణం, భక్తులకు తాగునీటి వసతి, దుస్తులు మార్చుకునేందుకు గదులు, విద్యుద్దీపాలు.. తదితర సౌకర్యాలు పూర్తిచేయాల్సి ఉంది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతుంటే... అందుకు భిన్నంగా ఇక్కడ నిదానంగా సాగుతున్నాయి. ఆరునెలల నుంచి అధికారులు పుష్కర ఏర్పాట్లకు సంబంధించి సమీక్షలు చేసినా... నిధుల లేమి కారణంగా పురోగతి కనిపించలేదు. చివరలో 49 లక్షల నిధులను కేటాయించగా.. అవి సరిపోవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

కాళేశ్వరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావటంతో... ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశముంది. అరకొర ఏర్పాట్లు చేస్తే భక్తులకు ఇబ్బందులు తప్పవు. పుష్కరాలకు మరో మూడ్రోజులే ఉండడంతో మరిన్ని నిధులు కేటాయించి శరవేగంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది.

ఇదీ చదవండి: గులాబీ ఇళ్లపై నల్లజెండాలు.. కేంద్రంపై కొనసాగుతోన్న తెరాస పోరు

ABOUT THE AUTHOR

...view details