తెలంగాణ

telangana

ETV Bharat / state

"రేగొండ కిడ్నాప్​".. ఆరోతరగతి పిల్లాడు ఆడిన ఓ నాటకం.. సినిమా స్టోరీని మించిన కట్టుకథ..! - regonda kidnap case

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కలకలం రేపిన కిడ్నాప్ కేసు.. పూర్తిగా కట్టుకథ అని తేలింది. తల్లిని వదిలి హాస్టల్​కు వెళ్లటం ఇష్టంలేని ఓ ఆరో తరగతి పిల్లాడు ఆడిన నాటకమని.. రెండు రోజుల పాటు సీరియస్​గా సాగిన దర్యాప్తు తర్వాత పోలీసులకు తెలిసింది. ఓ సస్పెన్స్​ థ్రిల్లర్​ సినిమా స్టోరీకి ఏమాత్రం తగ్గని.. ఆ ఆరో తరగతి పిల్లాడు అల్లిన కథ ఏంటో తెలియాలంటే.. ఈ కథనం మీరు తప్పక చదవాల్సిందే..

a sixth class student played kidnap drama for escape to not going to hostel
a sixth class student played kidnap drama for escape to not going to hostel

By

Published : Apr 6, 2022, 7:23 PM IST

"రేగొండ కిడ్నాప్​".. ఆరోతరగతి పిల్లాడు ఆడిన ఓ నాటకం.. సినిమా స్టోరీని మించిన కట్టుకథ..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండకు చెందిన పదకొండేళ్ల బాలుడే ఈ కథలో ప్రధాన పాత్ర(సూత్ర)ధారి. ప్రస్తుతం జాకారం సోషల్​ వెల్ఫేర్​ స్కూల్​లో ఆరో తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా సుమారు రెండేళ్లుగా ఇంట్లోనే ఉన్న బాలుడు.. ఈ మధ్యే హాస్టల్​కు వెళ్లాడు. ఇంట్లో అమ్మతో ఉండటం అలవాటైన తనకు.. హస్టల్​ ఉండటం కష్టమనిపించి మళ్లీ ఇంటికి వచ్చేశాడు. సుమారు నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. తనకు బాగా అలవాటైన కుమారునికి తనపై బెంగగా ఉందేమో అని తలచిన ఆ పిల్లాడి అమ్మ.. కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచుకుని తర్వాత పంపిస్తాననుకుంది. చాలా రోజులు కావటంతో.. ఈ నెల నాలుగున హాస్టల్​కి వెళ్లాలని పిల్లాడికి ముందే చెప్పింది.

హాస్టల్​కు వెళ్లాల్సిన రోజు ఉదయం..

నాలుగో తారీఖున ఉదయం.. "ఇయ్యాల నువ్వు హాస్టల్​కు పోవాలె గదా.. జల్ది పోయి నీకిట్టమైన టిపిన్​ చేశి రా.. పో బిడ్డా.." అని డబ్బులు ఇచ్చి పంపించింది తల్లి. హాస్టల్​కు వెళ్లటం ఎంత మాత్రం ఇష్టం లేని ఆ పిల్లాడు.. టిఫిన్​ సెంటర్​కు కాకుండా నేరుగా నడుచుకుంటూ వెళ్లాడు. పెట్రోల్ బంకు ముందు వరకు వెళ్లి.. అక్కడ ఓ బస్సు ఎక్కాడు. ఇదే పెట్రోల్ బంకు దగ్గర ఈ పిల్లాడితో పాటు వెంకటేశ్వర్లపల్లికి చెందిన ఐటీఐ కళాశాల విద్యార్థి రవితేజ కూడా అదే బస్​ ఎక్కాడు. ఈ అబ్బాయిని ఒంటరిగా చూసిన రవితేజ.. "ఒక్కడివే ఏడికి పోతున్నవ్​ చిన్నా..?" అని అడిగాడు. "తాత మంచిగ లేడు. పరకాల దవఖానాల ఉన్నాడు. అమ్మగుడ ఆన్నే ఉంది. నేను ఆడికే వోతున్న".. రవితేజ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు పిల్లాడు. అన్నట్టుగా పరకాలలో బస్సు ​దిగాడు. ఆ తర్వాత టాటా మ్యాజిక్ వాహనంలో హన్మకొండకి వెళ్లాడు.

భయంలోనూ మెరిసిన ఐడియా..

అయితే హన్మకొండలో ఆ పిల్లాడి అక్క ఉంటుంది. తన అక్క దగ్గరకు వెళ్దామనుకున్నాడు. హన్మకొండలో దిగే వరకు అంతా బాగానే ఉంది. కానీ.. అసలు సమస్య అప్పుడు మొదలైంది. అక్క ఇంటి అడ్రస్ మర్చిపోయి.. పిల్లాడు చిక్కుల్లో పడ్డాడు. ముందు చూస్తే నుయ్యి.. వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది పిల్లాని పరిస్థితి. "అక్క ఇంటికి పోదామంటే అడ్రస్​ యాదిలేదు. పోనీ.. మళ్లా ఇంటికి పోతే.. ఇట్ల జేశినందుకు అమ్మ, అన్న.. పొట్టుపొట్టు కొడతరు.." లోలోపలే మాట్లాడుకుంటూ భయపడుతున్నాడు. అంత క్లిష్టమైన పరిస్థితిలోనూ ఆ పిల్లాడికి టింగ్​మంటూ ఓ ఐడియా తట్టింది. "గీ ఐడియా మస్తుందిరా బై.. ఇది గిట్ల జేస్తే.. అటు అమ్మ, అన్న ఏం అనకపోవుడే గాదు.. ఇగ హాస్టల్​కు గుడ పంపియ్యరు.." అని మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు.

పిల్లాడి ప్లాన్​ అమలు..

అక్కడే ఒక కొబ్బరి తాడు తీసుకున్నాడు. అటుగా వెళ్తున్న ఓ స్కూల్​ పిల్లానికి ఆ తాడిచ్చి.. తన చేతులు కట్టేయమన్నాడు. ఆ పిల్లాడు కూడా సరదాకేమోనని.. చేతులను వెనక్కి కట్టేశాడు. అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాక.. అక్కడే కూర్చుని ఏడవటం మొదలు పెట్టాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్కే పాషా.. అనే ఒక మెకానిక్ అబ్బాయిని గమనించాడు. దగ్గరికి వెళ్లి.. "ఏమైంది బాబు..? ఎందుకేడుస్తున్నావ్​..? ఇక్కడేందుకున్నావ్​..? నీ చేతులు ఎవరు కట్టేశారు..?" ఆప్యాయంగా అడిగాడు. వెంటనే తన మనసులో అల్లుకున్న కథను పాషాకు చెప్పేశాడు. "నన్ను ఎవరో కిడ్నాప్​ చేశిర్రు. నా చేతులు కట్టేసి.. ఓమ్నీ కారులో తీసుకొచ్చిర్రు. నాతో పాటు ఇంకా ఇద్దరు పిల్లల్ని కూడా ఎత్తుకొచ్చిర్రు." ఏడుస్తూ చెప్పాడు. వాళ్ల అమ్మ ఫోన్​ నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్​కు ఫోన్​ చేసి.. విషయమంతా చెప్పగా.. కుటుంబసభ్యులు వచ్చి పిల్లాన్ని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ల అన్నయ్య అడిగినా.. అదే కథను ఉన్నదున్నట్టు మళ్లీ చెప్పాడు. దీంతో వాళ్ల అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అడిగినా కూడా అదే కథను మళ్లీ పొల్లుపోకుండా చెప్పాడు.

మొదలైన కిడ్నాప్​ కలకలం..

ఇంకేముంది.. ఈ విషయం బయటికి రావటం.. "ముగ్గురు విద్యార్థులు కిడ్నాప్​" అంటూ వార్తలు హల్​చల్​ చేయటం ప్రారంభమయ్యాయి. ఇక పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకుని విచారించారు. పిల్లాడు చెప్పిన వివరాలతో.. ఆయా ప్రాంతాల్లోని సీసీకెమెరా దృశ్యాలను పరిశీలించారు. కానీ.. పిల్లాడు చెప్పిన వివరాలకు, అక్కడున్న దృశ్యాలకు పొంతన కుదరటం లేదు. ఉదయం 6 నుంచి 9 వరకు ఈ అబ్బాయి చెప్పిన విధంగా ఓమ్నీ కారు ఒక్కటి కూడా వెళ్లలేదు. పోలీసులకు అనుమానం వచ్చి.. పిల్లాన్నే కొంచెం గట్టిగా అడిగారు. పోలీసులు అడిగిన తీరుతో భయపడ్డ పిల్లాడు.. మొత్తం చెప్పేశాడు. "అమ్మను విడిచిపెట్టి హాస్టల్​కు పోవటం ఇష్టలేక నేనే.. ఇదంతా చేశినా.." అని పోలీసులకు పూసగుచ్చినట్టు తాను అల్లిన కట్టు కథంతా ఏడుస్తూ చెప్పేశాడు. ఇది విని అవాక్కవటం పోలీసుల వంతైంది.

కేవలం తల్లిని వదిలి హాస్టల్​కి వెళ్లడం ఇష్టం లేక అబ్బాయి చెప్పిన అబద్దమే ఈ కిడ్నాప్​ అని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. మరో ఇద్దరు పిల్లలు కూడా కిడ్నాప్ అయ్యారనే విషయం కూడా అవాస్తవమని తేల్చారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details