Kakatiya Thermal Power Station Corona cases : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చేల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు రోజుల్లో 21 మంది ఇంజినీర్లకు వైరస్ నిర్ధరణ అయింది. శుక్రవారం 15 మంది... గురువారం ఆరుగురు ఇంజినీర్లకు వైరస్ సోకినట్లుగా కరోనా పరీక్షల్లో తేలింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో ఫీవర్ సర్వే
రాష్ట్రంలో కరోనా కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. రెండో దశ సమయంలో మంచి ఫలితాలు ఇచ్చిన ఫీవర్ సర్వేను మళ్లీ నిర్వహిస్తోంది. శుక్రవారం నుంచి సర్వే ప్రారంభమైంది. ఫీవర్ సర్వే వారం రోజుల్లో పూర్తిచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం చేస్తున్న ఈ ఫీవర్ సర్వేకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లో జరుగుతున్న ఫీవర్ సర్వేను సీఎస్ సోమేష్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఇతర అధికారులు పరిశీలించారు. ఫీవర్ సర్వే సమయంలో జ్వరం, లేదా ఇతర లక్షణాలు ఉంటే అక్కడికక్కడే మెడిసిన్ కిట్స్ అందజేస్తున్నట్లు చెప్పారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కానీ పెద్దగా లక్షణాలు కనిపించడం లేదన్నారు. త్వరలో కేసులు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.