రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులకు.. ఖర్చులకు పొంతనలేదు YS Sharmila comments on TS budget 2023-24 : రాష్ట్ర బడ్జెట్ 2023-24పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలోని చిల్పూర్ మండలంలో ఆమె పర్యటిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై వంగలపల్లిలో షర్మిల ప్రసంగించారు. తెలంగాణ బడ్జెట్‌లో ప్రభుత్వ కేటాయింపులకు, చేస్తున్న ఖర్చుకు ఎక్కడా పొంతనలేదని షర్మిల అన్నారు. కాళేశ్వరం మినహా మిగతా ప్రాజెక్టులను గాలికొదిలేశారని ఆరోపించారు. పేదలకు గృహాలు, ఉద్యోగుల భర్తీ, రుణమాఫీతో పాటు కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు.
TS budget 2023-24 : మరోవైపు ఇప్పటికే బడ్జెట్‌పై కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పించాయి. రాష్ట్ర బడ్జెట్ అంతా డొల్ల.. ఎలక్షన్ స్టంట్‌ను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో అంతా శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలేనని ఆయన విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా బడ్జెట్‌ను రూపొందించారని బండిసంజయ్ ఆరోపించారు.
Telangana budget 2023-24 : ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు ఈసారి కూడా మొండి చేయి చూపేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొంతనే లేదన్నారు. ప్రతిపాదిత బడ్జెట్‌లో 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయని కేసీఆర్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదనే సామెతకు అద్దం పడుతోందని ఆయన.. విమర్శించారు.
రాష్ట్ర బడ్జెట్ మేడిపండు, అంకెల గారడీ మాదిరిగా ఉందని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. విద్యుత్‌ను ఘనంగా ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం.. మరి వ్యవసాయానికి ఐదు గంటలు కూడా కరెంట్ రావడం లేదని.. దానికి పట్టించుకుంటారా అని నిలదీశారు. గత ఎనిమిదేళ్లుగా ఈ సబ్ ప్లాన్ నిధులను సర్కార్ పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. పాత పింఛన్ ఇవ్వాలని ఉద్యోగులు కోరుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఊరుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ ఊసే బడ్జెట్ ప్రసంగంలో లేదన్నారు.
సంక్షేమం, వ్యవసాయం అగ్ర ప్రాధాన్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సుమారు ఇరవై శాతం నిధులను సబ్బండ వర్గాల సంక్షేమానికి కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు నిధులు పెంచింది. వ్యవసాయానికి సింహభాగం నిధులు దక్కాయి. రైతుబంధు, రుణమాఫీ, వ్యవసాయ విద్యుత్‌కు నిధుల కేటాయింపులో పెద్దపీట వేసింది. పేదల గృహనిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్‌లో నిధులను కేటాయించడంతో పాటు బడ్జెట్ వెలుపల నిధులతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేయనుంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల భారీ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.