Tension At Jangaon : జనగామ జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న తెరాస కార్యకర్తల దాడికి నిరసనగా భాజపా కార్యాలయంలో మౌనదీక్ష చేపట్టారు. జనగామ ప్రధాన కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ర్యాలీగా వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారిని అడ్డుకుని పార్టీ కార్యాలయానికి తరలించారు. అక్కడే ఉన్న తెరాస కార్యకర్తలు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి యత్నించగా పోలీసులు వారించారు.
భాజపా కార్యాలయంలో చేపట్టిన మౌనదీక్షను భగ్నం చేసి కార్యకర్తలను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. నర్మెట్ట మండల చౌరస్తాలో భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. గాయపడినవారిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు.