తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం అమలును ప్రత్యక్షంగా వీక్షించేందుకు....పురపాలక శాఖ మంత్రి కేటీఆర్...జనగామలోని ధర్మకంచ బస్తీలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. చెత్తను మున్సిపాలిటీ సిబ్బంది తీసుకు వెళ్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బందితో ముచ్చటించారు.
చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
ప్రజలకు పరిపాలనను చేరువ చేస్తున్నామని..అందులో భాగంగానే కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, పంచాయతీలను ఏర్పాటు చేశారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లోనే.. పార్టీల నాయకులు ప్రజల ముందుకు వస్తారని...కానీ నాలుగేళ్లు ఏ ఎన్నికలు లేకున్నా....ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వారి గడప ముందుకు వచ్చామంటే...తమ చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవాలన్నారు.
పచ్చదనం పెంచాలి
ప్రతి వార్డుకు ఓ పారిశుద్ధ్య ప్రణాళిక తయారు చేయాలని... తడి, పొడి చెత్తను వేరు చేసి సిబ్బందికి అప్పగించాలని మంత్రి సూచించారు. కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు పట్టణంలో తిరిగి....పచ్చదనం పెంచాలని ఆదేశించారు. మొక్కల సంరక్షణ బాధ్యత కౌన్సిలర్లదేనని స్పష్టం చేశారు.