Bandi Sanjay Padayatra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ ప్రభుత్వం హైకోర్టులో వేసిన అప్పీల్‌పై విచారణ వాయిదా పడింది. సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బండి సంజయ్ పాదయాత్రను ఆపాలంటూ పోలీసులిచ్చిన నోటీసును హైకోర్టు సింగిల్ జడ్జి గురువారం సస్పెండ్ చేశారు. ప్రజాసంగ్రామ యాత్రకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
high court adjourned TS Govt Appeal to Stop Bandi Sanjay Padayatra: ఈ క్రమంలోనే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ దాఖలు చేసింది. అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని కోరింది. పాదయాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం రెండున్నరకు విచారణ చేపట్టిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
గతంలోనే పోలీసుల నోటీసులు..: బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని ఈ నెల 23న పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని.. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతి భద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.