Political Disputes in Station Ghanpur :అధికార పార్టీ బీఆర్ఎస్లో(BRS) మాటల కత్తులు దూసుకుంటున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. మరోసారి రాజకీయవేడీ రాజేశారు. కొన్ని నెలల క్రితమే కడియం శ్రీహరిపై.. రాజయ్య అవినీతి ఆరోపణలు చేయడం దీనికి తిరిగి కడియం ధీటుగా బదులివ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో పరిస్థితి మరింత ముదరకుండా రంగంలోకి దిగిన బీఆర్ఎస్ అధిష్ఠానం.. ఇరువురి నేతలకు సర్ధిచెప్పింది. దీంతో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఇద్దరు నేతలు.. మరోసారి మాటలకు పనిచెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరి.. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభిస్తే ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
Tatikonda Rajaiah vs Kadiyam Srihari : రాష్ట్రవ్యాప్తంగా అనేక సర్వేలు చేయించిన కేసీఆర్(KCR).. ఎక్కడ పార్టీ బలహీనంగా ఉందో, ఎక్కడైతే స్థానిక ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదో అక్కడ మార్పులు చేర్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్పులు చేర్పులు జరిగే నియోజకవర్గాల జాబితాలో స్టేషన్ ఘన్పూర్ కూడా ఉందని తెలిపారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మార్పు జరిగితే ఆ మార్పు ద్వారా తనకు అవకాశం లభిస్తే.. ప్రజలు గెలిపించాలని, నిజాయతీగా పనిచేస్తానని కడియం వ్యాఖ్యానించారు.
కడియం శ్రీహరి వ్యాఖ్యలకు రాజయ్య కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. ఏ సర్వేలు చేసినా నియోజకవర్గ అభ్యర్థి ఎంపికలో మార్పు ఉండబోదని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనవైపే ప్రజాబలం ఉంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. అర్హత లేకుండా కొందరు ఎమ్మెల్యే టికెట్ ఆశించడం సరికాదని తెలిపారు