జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు హైస్కూల్లో చదివేవారంతా నిరుపేదలే! అక్కడ విద్యార్థులది, తల్లిదండ్రులదీ ఒకటే లక్ష్యం. అది ఉత్తమ విద్య, సక్రమ మార్గం. ఉపాధ్యాయులు వారికి తోడయ్యారు. లక్ష్యాలన్నీ బాగున్నాయి. కానీ దాన్ని చేరాలంటే ఆర్థిక పరిస్థితులే అనుకూలించట్లేదు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలి. దీనికోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అందరూ నిర్ణయించుకున్నారు. దానికి కార్యాచరణ రూపొందించారు.
ఉపాధ్యాయులే తల్లిదండ్రులుగా...
పాఠశాలలో మొత్తం 60 మంది విద్యార్థులున్నారు. ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే తప్ప ప్రత్యేక తరగతులకు హాజరుకాలేరు. అన్నీ వ్యవసాయ కూలీల కుటుంబాలే కావటం వల్ల అంత పొద్దున్నే వీరికి అన్నం వండి వడ్డించడం తల్లిదండ్రులకు సాధ్యం కావడం లేదు.
మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా చదువుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనికోసం పిల్లలకు తామే అల్పాహారం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు నిర్ణయించుకున్నారు. రెండు రోజులకొకసారి తమ వంతుగా ఆహారం అందిస్తూ వస్తున్నారు.
చిన్న మనస్సు... గొప్ప ఆలోచన
వీరి కష్టాన్ని గమనించిన కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో చిన్ని ఆలోచన కలిగింది. వారికి ఎంతోకొంత అల్పాహారం ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పాఠశాలకు సెలవు రోజుల్లో పొలం పనులకు, పత్తి తీయడానికి వెళ్లి తలో వెయ్యి రూపాయలు సంపాదించారు.
తమ ఉద్దేశాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెప్పి తాము తెచ్చిన డబ్బులతో విద్యార్థులకు అల్పాహారం అందించాలని అభ్యర్థించారు. దానికి ప్రధానోపాధ్యాయుడు నర్సయ్య మొదట నిరాకరించారు. కానీ విద్యార్థులు పట్టుబట్టడం వల్ల చివరికి ఆయన తప్పనలేక పోయారు. విద్యార్థులు తెచ్చిన డబ్బులతో ఉపాధ్యాయులు ఆ పిల్లలకు అల్పాహారం అందిస్తున్నారు.
తోటి విద్యార్థుల కోసం వారి చిన్ని హృదయాలు ఎంతగా తల్లడిల్లాయో, వారిని ఎంతలా ఆలోచింపజేశాయో అర్థమవుతోంది కదా.
తోటివారి కోసం ఆ విద్యార్థులు ఏం చేశారో తెలుసా? ఇవీచూడండి: 'హ్యాపీ న్యూ ఇయర్' పేరుతో జియో అదిరే ఆఫర్