ఐడియా అదిరింది గురూ: బస్‌లో షాపింగ్ మాల్.. ఏ వస్తువైనా రూ.15 మాత్రమే - shopping mall in bus at kodakandla
Bus Bazar in Jangaon : కుక్కపిల్ల, సబ్బు బిల్ల, అగ్గిపుల్ల.. కాదేది కవితకు అనర్హం అన్నాడో మహాకవి. సద్వినియోగం చేసుకునే ఆలోచనంటూ ఉండాలే కానీ వ్యర్థ పదార్థం అంటూ ఏదీ ఉండదని నిరూపించాడు ఓ చిరు వ్యాపారి. అందుకే కాలం చెల్లిన బస్సును తన వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నాడు. విలేజ్ బజార్ అనే పేరుతో బస్సులోనే చిన్నపాటి షాపింగ్‌మాల్‌ను తెరిచి వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. మరి ఈ బస్ బజార్ సంగతేంటో ఓ సారి చూసేద్దామా..!
Bus Bazar in Jangaon : ‘ఏ వస్తువైనా రూ.15 మాత్రమే.. బస్సెక్కండి.. నచ్చిన వస్తువు కొనుగోలు చేయండి’ అంటూ ప్రచారం చేస్తూ సంతలో ప్రజలను ఆకర్షించి వ్యాపారం చేస్తున్నారో వ్యక్తి. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఆర్టీసీకి అద్దెకిచ్చిన ఒక బస్సు కాలం తీరిపోయింది. బస్సు యజమాని దాన్ని సద్వినియోగం చేసేందుకు వినూత్నంగా ఆలోచించారు. అందులోని సీట్లను తొలగించి ర్యాక్‌లు ఏర్పాటు చేశారు. రోజువారీ అవసరమయ్యే చిన్నచిన్న వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రి, మహిళల సౌందర్య వస్తువులు, పిల్లలకు విజ్ఞానం పంచే చార్టులు, చిన్న కత్తెరలు, గ్యాస్ లైటర్లు తదితర వస్తువులను ఆ ర్యాక్‌లలో అమర్చారు. అన్ని రకాల వస్తువులు బస్సులో తమ చెంతకే వస్తుంటే ప్రజలు ఆకర్షితులై కొనుగోలు చేస్తున్నారు.