Bhoodan Movement Lands :జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామంలో సర్వే నంబరు 206లో 110 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ భూదాన్ భూములతో పాటు సర్వే నంబరు 200, 203, 209 బై నంబర్లలోనూ ఎసైన్డ్ భూములున్నాయి. వీటితో పాటు జనగామ మండలం ఎర్రగొల్లపాడులో సైతం భూదాన్ భూములు పెద్దమొత్తంలో అన్యాక్రాంతం అవుతున్నట్లు తెలుస్తోంది. వెంచర్లు వేసేందుకు ఈ ప్రాంతంలో ఎసైన్డ్‌తో పాటు పట్టా భూములను రియల్ మాఫియా చదును చేయడం ప్రారంభించింది. దీంతో గతేడాది నుంచి రైతులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా స్పందన శూన్యం.
ఒత్తిడి.. ఒప్పుకోకపోతే బెదిరింపులు
Bhoodan Movement Land Issue :ఎసైన్డ్ భూములను సాగు చేస్తున్నవారిని భూములు అమ్మాలని ఒత్తిడి చేయడం, లేదంటే బెదిరింపులకు దిగడం, ఈ ప్రాంతంలో పట్టాలు కలిగిన రైతుల భూములను అక్రమంగా చదును చేయడంతో బాధితులు పోలీసు స్టేషన్, రెవెన్యూ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేశారు. ఇంత పెద్దసంఖ్యలో బాధితులు న్యాయం చేయాలంటూ అధికారుల వద్దకు వెళ్లినా దృష్టి సారించకపోవడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ భూదందాలో ఉల్లంఘనలు కూడా అనేకం ఉన్నాయి. ఎసైన్డ్ భూములను కొనడం నేరం. గతంలో ఉపాధి హామీ కింద నాటిన మొక్కలు, గుట్టలపై ఉన్న వృక్షాలను అటవీశాఖ అనుమతి లేకుండా నరికేయడం వాల్టా చట్టం కింద అపరాధం. మైనింగ్ అనుమతులు లేకుండా గుట్టలను తవ్వడం, బెదిరింపులకు దిగి భూములు కొనడం లాంటి ఉల్లంఘనలతో రియల్ మాఫియా ఇష్టారీతిన దందా సాగిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.